● టీడీపీ జమానాలో పని తక్కువ.. ఆర్భాటపు ప్రచారం ఎక్కువ ● సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్‌ నారాయణ ధ్వజం ● క్రెడిట్‌ చోరీకి ముందు సీపీఐ పోరాటాన్ని గుర్తు చేసుకోవాలని హితవు | - | Sakshi
Sakshi News home page

● టీడీపీ జమానాలో పని తక్కువ.. ఆర్భాటపు ప్రచారం ఎక్కువ ● సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్‌ నారాయణ ధ్వజం ● క్రెడిట్‌ చోరీకి ముందు సీపీఐ పోరాటాన్ని గుర్తు చేసుకోవాలని హితవు

Aug 27 2026 1:30 AM | Updated on Aug 27 2026 1:30 AM

● టీడీపీ జమానాలో పని తక్కువ.. ఆర్భాటపు ప్రచారం ఎక్కువ ● సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్‌ నారాయణ ధ్వజం ● క్రెడిట్‌ చోరీకి ముందు సీపీఐ పోరాటాన్ని గుర్తు చేసుకోవాలని హితవు

మార్కాపురం: నిత్యం కరువు కటాకాలకు నిలయమైన మార్కాపురం జిల్లా ప్రజలకు కృష్ణా జలాలను తరలించడం ద్వారానే శాశ్వత పరిష్కారం లభిస్తుందని గుర్తించి, అందుకోసం నాలుగు దశాబ్దాలుగా సీపీఐ రాజీలేని పోరాటాల ఫలితంగానే పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులు తుది దశకు చేరుకుని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎంఎల్‌ నారాయణ తెలిపారు. పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1996లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన అయితే చేశారు కానీ, ఒక్క రూపాయి కూడా నిధులు మంజూరు చేయకుండా కాలక్షేపం చేశారని విమర్శించారు. తీరా ఇప్పుడు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది తానేనని, పూర్తి చేసింది కూడా తానేనని చంద్రబాబు చెప్పుకోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఈ నెల 31న నల్లమల సాగర్‌కు 10.5 టీఎంసీల నీటిని విడుదల చేసి ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్నామని ప్రభుత్వం ఆర్భాటం చేయడం సరికాదన్నారు. నల్లమల సాగర్‌ పూర్తి నిల్వ సామర్థ్యం 53.5 టీఎంసీలు కాగా, కేవలం 10.5 టీఎంసీల నీరు విడుదల చేయడం వల్ల అది డెడ్‌ స్టోరేజ్‌ స్థాయిలోనే ఉంటుందని, దీంతో సాగు, తాగునీటి అవసరాలకు ఆశించిన ప్రయోజనం కలగదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో వినియోగంలోకి రావాలంటే మరో రూ.4 వేల కోట్ల మేర నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. నిర్వాసితుల పునరావాసం, పునరావాస పరిహారం (ఆర్‌అండ్‌ఆర్‌) ప్యాకేజీ కోసం కూడా తగిన నిధులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తే ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు కడప జిల్లాలోని 32 మండలాలు సస్యశ్యామలం కావడంతో పాటు 20 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందుతుందని అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం సీపీఐ నాయకులు పూల సుబ్బయ్య, గుజ్జుల ఎల్లమందారెడ్డి, రావులపల్లి చెంచయ్య, సానికొమ్ము కాశిరెడ్డి, తుపాకుల బసవయ్యలు కృషి చేశారని గుర్తు చేశారు. రాజధాని నిర్మాణానికి ఇప్పటికే రూ.35 వేల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం, మరో రూ.35 వేల కోట్లు సమీకరించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో నిర్వాసితుల ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కోసం అదనంగా రూ.200 కోట్లు కేటాయించేందుకు మీనమేషాలు లెక్కిస్తోందని విమర్శించారు. ప్రస్తుతం నిర్వాసితులకు ఇస్తున్న రూ.12.50 లక్షలతో ఇల్లు నిర్మించుకోవడం అటుంచి, 100 గజాలు ఖాళీ స్థలం కూడా కొనడం సాధ్యం కాదని అన్నారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర నాయకులు కేవీ కృష్ణగౌడ్‌, నియోజకవర్గ పార్టీ కార్యదర్శి ఎస్‌కే కాశీం, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి పవన్‌కళ్యాణ్‌, పార్టీ నాయకులు బాణాల రామయ్య, డి.కేశవరావు, శంకర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement