● నామ్ రహదారిపై బొడ్డువానిపాలెం వద్ద ప్రమాదం
మేదరమెట్ల: నార్కెట్‌పల్లి–అద్దంకి–మేదరమెట్ల (నామ్) రహదారిపై బొడ్డువానిపాలెం సమీపంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సుమారు 65 ఏళ్ల గుర్తుతెలియని వృద్ధుడు మృతి చెందాడు. ఎస్సై రమేష్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి ఒంగోలుకు కారులో ఓ కుటుంబం వెళ్తోంది. బొడ్డువానిపాలెం వద్దకు రాగానే ఓ వృద్ధుడు అకస్మాత్తుగా డివైడర్ దాటి రోడ్డుపైకి రావడంతో కారు బలంగా ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడు గత మూడు నెలలుగా నామ్, ఎన్‌హెచ్–16 కూడలి ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ఉంటూ యాచిస్తూ జీవనం సాగిస్తున్నాడు. మృతుడి వివరాలు తెలిసిన వారు వెంటనే మేదరమెట్ల పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై కోరారు.
జె.పంగులూరు: జాతీయ రహదారిపై లారీ క్యాబిన్ నుంచి ప్రమాదవశాత్తు కిందపడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ముప్పవరం గ్రామ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. మదనపల్లె నుంచి టమోటా లోడుతో తెనాలి వైపు వెళ్తున్న లారీ ముప్పవరం సమీపంలోని సాయిబాబా ఆలయం వద్దకు చేరుకుంది. ఆ సమయంలో క్యాబిన్‌లో డోర్ వైపు కూర్చున్న లారీ యజమాని జట్టు కోటిరెడ్డి (56).. డోర్ లాక్ అనుకోకుండా తెరుచుకోవడంతో కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు గుంటూరు జిల్లా తెనాలి గంగమ్మపేటకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
హనుమంతునిపాడు: పాఠశాలకు వెళ్తూ ప్రమాదవశాత్తు ఆటోలోంచి కిందపడి తీవ్రంగా గాయపడిన తొమ్మిదేళ్ల విద్యార్థిని ఒంగోలు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసుల వివరాల ప్రకారం.. రశీదుపురం గ్రామానికి చెందిన ముల్లపాటి మరియబాబు కుమార్తె ముల్లపాటి సెల్సీ(9) 3వ తరగతి చదువుతోంది. ఈ నెల 20వ తేదీన రశీదుపురం నుంచి కోటతిప్పళ్ల పాఠశాలకు ఆటోలో వెళ్తుండగా మార్గమధ్యంలో జారి కిందపడింది. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయమై రక్తం గడ్డకట్టడంతో బాలిక కోమాలోకి వెళ్లింది. వెంటనే కుటుంబసభ్యులు ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజ్‌కుమార్ తెలిపారు.
● మృత కళేబరాలను ఢీకొని బియ్యం లోడు లారీ బోల్తా
బేస్తవారిపేట: ఒంగోలు–నంద్యాల జాతీయ రహదారిపై లక్ష్మీపురం సమీపంలో బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. రోడ్డు దాటుతున్న గేదెల గుంపును గుర్తుతెలియని వాహనం వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు గేదెలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో గేదె కాలు విరిగింది. అదే సమయంలో కంభం వైపు నుంచి కడప వైపు బియ్యం బస్తాల లోడుతో వెళ్తున్న లారీ రోడ్డుపై పడి ఉన్న గేదెల కళేబరాలను గమనించక ఢీకొట్టింది. దీంతో లారీ అదుపుతప్పి రహదారి మార్జిన్‌లో బోల్తా పడింది. సమాచారం అందుకున్న హైవే పెట్రోలింగ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, పశువుల కళేబరాలను రోడ్డు పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
మేదరమెట్ల: ప్రేమ వివాహం చేసుకున్న నూతన వధూవరులు రక్షణ కల్పించాలంటూ బుధవారం కొరిశపాడు పోలీసులను ఆశ్రయించారు. ఏఎస్సై సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం.. కొరిశపాడు మండల పరిధిలోని ప్రాసంగులపాడు గ్రామానికి చెందిన యువకుడు, అనమనమూరు గ్రామానికి చెందిన యువతి గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మేజర్లయిన వీరిద్దరూ ఇటీవల ఒంగోలులో కొందరు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. తమ వివాహం ఇరు కుటుంబాలకు ఇష్టం లేనందున, వారి నుంచి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రక్షణ కల్పించాలని కోరారు. వారి వెంట వచ్చిన పెద్దల సమక్షంలో స్టేట్‌మెంట్ రికార్డు చేసినట్లు పోలీసులు తెలిపారు.


