పీఆర్సీని నియమించి ఐఆర్‌ ప్రకటించాలి | - | Sakshi
Sakshi News home page

పీఆర్సీని నియమించి ఐఆర్‌ ప్రకటించాలి

Aug 24 2026 1:25 AM | Updated on Aug 24 2026 1:25 AM

పీఆర్సీని నియమించి ఐఆర్‌ ప్రకటించాలి ముగిసిన రాష్ట్రస్థాయి సైకిల్‌ పోలో పోటీలు వ్యక్తి అదృశ్యం కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ డిమాండ్‌

ఒంగోలు టౌన్‌: గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే పీఆర్సీని నియమించాలని, ఐఆర్‌ను ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.శేషారావు డిమాండ్‌ చేశారు. నగరంలోని ఏపీటిఎఫ్‌ కార్యాలయంలో ఆదివారం జిల్లా సబ్‌ కమిటి, రాష్ట్ర కౌన్సిలర్ల సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఫెడరేష్‌ జిల్లా అధ్యక్షులు ఏ.శేఖర్‌బాబు అధ్యక్షత వహించారు. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను ప్రకటించాలని, ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బకాయిలను మంజూరు చేయాలని, ఇన్‌ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్‌ క్వాలిఫైయింగ్‌ మార్కులు 40 శాతం ఉంటే 60 మార్కులుగా మార్పులు చేయాలని కోరారు. అనంతరం ఉపాధ్యాయుల సమస్యలపై సమగ్రంగా చర్చించారు. కార్యక్రమంలో పూర్వ కార్యదర్శి ఐ.విజయ సారిధి, బి.రఘుబాబు, సబ్‌ కమిటీ సభ్యులు పి.హనుమంతరావు, సీహెచ్‌.శివరామకృష్ణ, ఏలేని ప్రసాద్‌, డి.మధు, పి.రమేష్‌, బషీరున్నిసా, అంజనాదేవి, వీ.రవి, మునీర్‌ బాషా, కె.శ్రీనివాసరావు, ఏ.వెంకటేశ్వర్లు, జె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ధర్మవరం: పట్టణంలోని లక్ష్మీచెన్నకేశవపురంలో ఉన్న యశోద ఇంగ్లిష్‌ మీడియం హైస్కూల్‌లో జరిగిన ఒకటో ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ జూనియర్‌ బాలబాలికల రాష్ట్రస్థాయి సైకిల్‌ పోలో పోటీలు ఆదివారం ముగిశాయి. పోటీల్లో రాష్ట్రంలోని 11 జిల్లాలకు చెందిన క్రీడాకారులు పోటీపడ్డారు. బాలుర విభాగంలో మొదటిస్థానం ప్రకాశం జిల్లా, ద్వితీయస్థానం అనంతపురం జిల్లా, తృతీయ స్థానం కడప జిల్లా, బాలికల విభాగంలో మొదటి స్థానం అన్నమయ్య జిల్లా, ద్వితీయస్థానం సత్యసాయి జిల్లా, తృతీయస్థానం కడప జిల్లా జట్లు నిలిచాయి. ఎంపికై న క్రీడాకారులు నవంబర్‌లో రాజస్థాన్‌ రాష్ట్రంలోని జోద్పూర్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. బహుమతుల ప్రదానోత్సవంలో రాష్ట్ర సైకిల్‌ పోలో అసోసియేషన్‌ కార్యదర్శి రేవంత్‌, సూర్య స్కూల్‌ కరస్పాండెంట్‌ నరేంద్ర, రాష్ట్ర సైకిల్‌ పోలో కోశాధికారి సునిల్‌, రాష్ట్ర సైకిల్‌ పోలో ఉపాధ్యక్షుడు ఎర్రన్న, వ్యాయామ ఉపాధ్యాయులు అశోక్‌,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మద్దిపాడు: మండలంలోని నాగన్నపాలేనికి చెందిన పాలేటి శ్రీను కనిపించడం లేదని కుమార్తె స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ నెల 20వ తేదీ ఇంటిని నుంచి వెళ్లిపోయాడని, అప్పటి నుంచి బంధువులు, తెలిసిన వాళ్లను విచారించినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆదివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement