● ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ పిన్నిక మధుసూదనరావు
ఒంగోలు సబర్బన్: విజయవాడలో ఈ నెల 28 నిర్వహించనున్న ఉద్యమ శంఖారావం రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్, రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పిన్నిక మధుసూదనరావు పిలుపునిచ్చారు. స్థానిక రెవెన్యూ భవన్‌లో ఆదివారం రాత్రి ఏపీ జేఏసీ అమరావతి ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా అనుబంధ సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిన్నిక మధుసూదనరావు మాట్లాడుతూ ఈ నెల 28న విజయవాడలో నిర్వహించనున్న ఉద్యమ శంఖారావం సదస్సుకు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యోగుల హక్కులు, సమస్యలు, న్యాయమైన డిమాండ్ల సాధన కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యమ బాట పట్టాల్సిన అవసరం ఏర్పడిందని నాయకులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రతి విభాగంలోని ఉద్యోగులకు వివరించి, ఉద్యమానికి ఉద్యోగులందరినీ సమాయత్తం చేయాలని సూచించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ఉద్యమించడం ద్వారానే మన హక్కులను సాధించుకోగలమన్నారు. ప్రతి ఉద్యోగి 28న విజయవాడలో జరిగే ఉద్యమ శంఖారావం రాష్ట్ర సదస్సుకు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే జిల్లా ఏపీ జేఏసీ అమరావతి కార్యవర్గ సభ్యుల తీర్మానం మేరకు తాత్కాలిక ఏపీ జేఏసీ అమరావతి ప్రకాశం జిల్లా చైర్మన్‌న్‌గా టంగుటూరు తహసీల్దార్ ఆంజనేయులును నియమించారు. సమావేశంలో ఆంజనేయులు, ఉతకోలు శ్రీనివాసరావు, పోలయ్య, రాజు, వెంకటేశ్వరరెడ్డి, రాయుడు, నాల్గవ తరగతి ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు కొమాటిగుంట వెంకటేశ్వర్లు, యోబు, ఎం. శ్రీనివాసులు, శ్రీదేవి, లావణ్య పాల్గొన్నారు.


