న్యూస్‌రీల్
వరుసగా అవినీతి నిరోధకశాఖ అధికారులు దాడులు చేస్తూ..అవినీతి అధికారులపై చర్యలు తీసుకుంటున్నా ఒంగోలు నగరపాలక సంస్థ అధికారుల తీరులో మార్పు కనిపించడం లేదు. ఏసీబీ అధికారులకు ఒకసారి చిక్కితే...ఇక ఎన్నిసార్లు చిక్కినా ఒకటే శిక్ష అన్న చందంగా తయారయింది ఇక్కడి పరిస్థితి. అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ బదిలీ అయిన కమిషనర్‌తో పాటు ఆరుగురు అధికారులపై వేటు పడింది. ఆ విషయం ఇంకా చల్లారక ముందే కార్పొరేషన్‌లో చక్రం తిప్పుతున్న ఆర్‌ఐ నరేంద్ర ఏసీబీ అధికారులకు చిక్కడం సంచలనంగా మారింది. నగర పాలక సంస్థలోని దాదాపు అన్ని విభాగాల్లో అధికారులు, సిబ్బంది అవినీతి అక్రమాల్లో మునిగి తేలుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏ పనికై నా...ఎంతటి వారైనా చేతులు తడపందే పనులు జరగవు అన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
ఒంగోలు సబర్బన్:
ఒంగోలు నగరపాలక సంస్థ అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. వివిధ అనుమతుల కోసం వచ్చే బడాబాబుల దగ్గర నుంచి చిన్నా చితకా పనుల కోసం వచ్చే ప్రజల వరకు అందరి దగ్గర నుంచి కాసులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం పాలక మండలి సైతం లేకపోవడంతో లంచావతారులకు అడ్డేలేకుండా పోయింది. బీపీఎస్ స్కీమ్‌లో టౌన్‌ప్లానింగ్ విభాగంలో జరిగిన అక్రమాలపై గతంలో కమిషనర్ కే.వెంకటేశ్వరరావు చేసిన అవినీతి భాగోతంపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. దీంతో కమిషనర్ ఏప్రిల్ 14వ తేదీ నుంచి నెల రోజులు సెలవుపై వెళ్లిపోయారు. అయితే భవనాల అక్రమ నిర్మాణాల విషయంలో అవినీతికి పాల్పడినట్లు తేలటంతో కమిషనర్‌గా పనిచేసిన కే.వెంకటేశ్వర రావుతో పాటు మరో ఐదుగురిపై చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. టౌన్ ప్లానింగ్ విభాగంలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ చర్యలకు ఉపక్రమించారు. ఈ మేరకు అక్రమాలకు పాల్పడిన వారిని సస్పెండ్ చేయాలంటూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్‌లోని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ కార్యాలయ డైరెక్టర్ చర్యలు తీసుకున్నారు. సస్పెండైన వారిలో మాజీ కమిషనర్ కే.వెంకటకేశ్వరరావుతో పాటు టీపీఓగా పనిచేస్తున్న కే.బాబూరావు, టీపీఎస్‌గా పనిచేస్తున్న షేక్ రసూల్, టౌన్‌ప్లానింగ్ విభాగానికి సంబంధించి వార్డు కార్యదర్శులుగా పనిచేస్తున్న కే.జోషి, శిరీష, జీ.సాయి మురళీకృష్ణ ఉన్నారు. అదేవిధంగా రిటైరైన ఏసీపీ జెడ్.సుధాకర రావు, టీపీఎస్ ఎన్.నారాయణ రావుల పెన్షన్‌ను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇది నగర పాలక సంస్థను ఒక కుదుపు కుదిపింది. ఇది జరిగి 20 రోజులు కాక ముందే ఆర్‌ఐ నరేంద్ర ఏసీబీ అధికారులకు చిక్కడంతో అవినీతి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా తెలియజేస్తోంది. వరుస ఘటనలు కార్పొరేషన్‌లో అవినీతి, అక్రమాలు ఎంతగా వేళ్లూనుకున్నాయో స్పష్టం చేస్తున్నాయి.
ఒంటి చేత్తో చక్రం తిప్పిన ఇన్‌చార్జ్ ఆర్‌ఐ నరేంద్ర...


