మంచి ప్రభుత్వమంటే ముంపు గ్రామాల ప్రజలను జలసమాధి చేయడమా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకనాథం
మార్కాపురం: నిర్వాసితుల సమస్యలను అసెంబ్లీలో చర్చించరా అని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకనాథం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం సాయంత్రం మార్కాపురం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపునకు గురవుతున్న గ్రామాల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా ఉందని విమర్శించారు. దాదాపు 11 గ్రామాలు, 10 వేల కుటుంబాలు ముంపునకు గురవుతున్నాయని, వీరి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటుందో అర్థంకావడం లేదన్నారు. 2013 భూ సేకరణ చట్టప్రకారం రైతులకు కూడా నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఆ భూమిపై ఆధారపడిన వ్యవసాయ కూలీలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలన్నారు. నిర్వాసితుల సమస్యలపై ప్రత్యేక దృష్టిపెట్టామని చెబుతున్న ప్రభుత్వం ఆచరణలో చూపడంలేదన్నారు. అసెంబ్లీలో నిర్వాసితుల సమస్యలపై ఎమ్మెల్యేలు ఎందుకు నోరుమెదపడం లేదన్నారు. ఆఘమేఘాలపై నిర్వాసితులందరినీ ఇల్లు ఖాళీచేసి వెళ్లిపొమ్మంటున్నారని, వారెక్కడుంటారని ప్రశ్నించారు. నిర్వాసితులకు సౌకర్యాలు కల్పించకుండా ఖాళీ చేయమనడం భావ్యంకాదన్నారు. నిర్వాసితులకు ఇంతవరకూ ఇల్లులు కట్టించి ఇవ్వలేదన్నారు. నిర్వాసితులకు అన్యాయం జరుగుతోందని అన్నారు. మంత్రిగా నిమ్మల రామానాయుడు నిర్వాసితులకు భరోసా ఇవ్వాలన్నారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ బుధవారం తాము సుంకేశుల, గొట్టిపడియ గ్రామాలను సందర్శించామని వారి సమస్యలను పరిష్కరించకుండా ఖాళీ చేయమంటే ఎలా అని ప్రశ్నించారు. అందరికీ నష్టపరిహారం పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేశారు. మంచి ప్రభుత్వమంటే 11 గ్రామాల ప్రజలను నాశనం చేయడమా..రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను జలసమాధి చేస్తారా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పూసపాటి వెంకటరావు, గాలి వెంకటరామిరెడ్డి, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.


