ఒంగోలు టౌన్: దళిత వాడల్లో మౌలిక వసతుల కల్పన, కులవివక్ష, అంటరానితనాన్ని నిర్మూలించాలన్న డిమాండ్‌తో ఈ నెల 20, 21 తేదీల్లో మోటారు బైకు యాత్రలు చేపట్టనున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కోశాధికారి కంకణాల ఆంజనేయులు తెలిపారు. నగరంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో బుధవారం యాత్రకు సంబంధించి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ జిల్లాలోని 18 మండలాలు, 67 గ్రామాలు, 3 పంచాయతీలు, 16 వార్డుల్లోని 131 దళిత వాడల్లో సర్వే నిర్వహించినట్లు తెలిపారు. ఈ సర్వేలో 40 ప్రాంతాల్లో శ్మశాన వాటిక సమస్యలు ఉన్నాయని, 30 చోట్ల ఇళ్ల స్థలాలు, 13 ప్రదేశాల్లో భూ సమస్యలున్నాయని వివరించారు. ఇంకా 32 ప్రాంతాల్లో మంచినీరు, 32 చోట్ల లింకు రోడ్లు, 22 చోట్ల విద్యుత్ స్తంభాలు, 14 ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల సమస్యలను గుర్తించినట్లు తెలిపారు. డ్రైనేజీ, పారిశుధ్యం, అంగన్‌వాడీలు, వైద్యం, ఉపాధి, విద్యుత్ బకాయిల సమస్యలు తీవ్రంగా ఉన్నట్లు చెప్పారు. జీవో 1235 ప్రకారం ప్రతి దళిత వాడకు 2 ఎకరాల శ్మశాన వాటికకు భూమి కేటాయించాలని, ప్రహరీలు నిర్మించి , అంతర్గత రోడ్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మూసివేసిన పాఠశాలలను తిరిగి తెరవాలని, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇవ్వాలని, అట్రాసిటీ కేసుల్లో బాధితులకు న్యాయం చేయాలని, అంబేడ్కర్ స్టడీ సర్కిళ్లు బలోపేతం చేయాలని కోరారు. పెండింగ్ విద్యుత్ బకాయిల సమస్యలను పరిష్కరించి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను సమర్ధవంతంగా అమలు చేయాలన్నారు. సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కేజీ మస్తాన్, నెరుసల వెంకటేశ్వర్లు, కాలం సుబ్బారావు, కంకణాల రమాదేవి, రమేష్, బాలకోటయ్య, ఎస్‌డీ హుసేన్, మహేష్ పాల్గొన్నారు.


