సాక్షి టాస్క్‌ఫోర్స్: పొన్నలూరు, జరుగుమల్లి మండలాల పరిధిలోని పాలేరు నది పరీవాహక గ్రామాలైన వేంపాడు, ఉప్పలదిన్నె, రావులకొల్లు, చతుకుపాడు, పైడిపాడు గ్రామాల్లో అధికారపార్టీ ముఖ్య నేతలు గత రెండేళ్లగా మంత్రి స్వామి, మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య అండదండలతో యథేచ్ఛగా అక్రమంగా ఇసుకను రవాణ చేస్తూ కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. అధికారపార్టీ నేతల అక్రమ ఇసుక దందాపై పాలేరు నదీ పరీవాహక గ్రామాల ప్రజలు పక్కా ఆధారలతో పలుమార్లు హైకోర్టులో ఫిర్యాదు చేశారు. దీంతో అక్రమ ఇసుక రవాణాపై విచారించిన హైకోర్టు వాస్తవాలను గ్రహించి సంబంధిత అక్రమార్కులపై పీడీ యాక్ట్, మండల బహిష్కరణ, కేసులతో చర్యలు తీసుకోవాలని మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖలకు లిఖిత పూర్వకంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో సోమవారం రెవెన్యూ, మైనింగ్, పోలీస్ శాఖల అధికారులు పాలేరులో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాను పరిశీలించినట్లు ఫొటో దిగారు. అయితే అధికారులు అక్రమ ఇసుక రవాణా జరుగుతున్న ప్రాంతంలో కాకుండా మరొక ప్రాంతంలో ఫొటో దిగారు. దీనిపై మంగళవారం సాక్షి పత్రికలో ‘తవ్వకాలు ఒకచోట.. పరిశీలన మరోచోట’ అనే శీర్షికన ప్రచురణ కావడంతో బుధవారం ఉన్నతాధికారులు స్పందించి పాలేరులో పోలీసుల నిఘా ఉంచి తనిఖీలు చేపట్టారు. దీంతో అధికారుల రాకను గమనించిన అక్రమార్కులు తమ ట్రాక్టర్లు, పొక్లెయిన్లతో పాలేరు నుంచి ఉడాయించారు. మైనింగ్, పోలీసులతో పాలేరులో నిఘా ఉంటుందని ఎవరైనా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


