సీఎం.. మంత్రుల ఉత్తుత్తి హెచ్చరికలు
రోజురోజుకూ పతనం దిశగా పొగాకు ధరలు
రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా పట్టని పాలకులు
ఇప్పటి వరకూ 52.57 మిలియన్ కేజీలు మాత్రమే కొనుగోలు
31 నుంచి 36 శాతానికి పెరిగిన తిరస్కరణ బేళ్లు
మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి
దించాలంటున్న రైతు సంఘాలు
ఒంగోలు సబర్బన్: నానా అవస్థలు పడి పండించిన పొగాకును వేలం కేంద్రాలకు తీసుకెళితే దిగజారుతున్న ధరలను చూసిన రైతులు తలలు పట్టుకుంటున్నారు. 1980 దశకంలో పోరాటం చేసి పోలీసుల తుపాకీ గుళ్లకు గుండెలను ఎదురొడ్డి మరీ సాధించుకున్న మద్దతు ధరలు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి మరీ దిగ‘‘జారిపోతున్నాయని’’ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క రైతులు మాత్రం కనీసం మద్దతు ధర దేవుడెరుగు...గిట్టుబాటు ధర అయినా దక్కకపోతుందా అంటూ ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు పొగాకు కంపెనీల యాజమాన్యాలకు హెచ్చరికలు జారీ చేయటం...సరాసరి కేజీ పొగాకును రూ.200 తక్కువ కాకుండా కొనుగోలు చేయాలని ఆదేశించినప్పుడల్లా పొగాకు కంపెనీలు మాత్రం అప్పటి వరకు ఉన్న ధర కంటే మరీ దిగకోసి కొనుగోలు చేస్తున్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఆదేశాలను కంపెనీలు బేఖాతరు చేస్తుండడం వెనుక పెద్ద కుట్రదాగి ఉందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.
తీవ్ర సంక్షోభంలోకి..
ప్రకాశం, నెల్లూరు, పల్నాడు జిల్లాలకు చెందిన దక్షిణాది ప్రాంత నల్లరేగడి, తేలికపాటి నేలల్లో పొగాకు పండిస్తున్న రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుతున్నారు. మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపి కనీస ధర రూ.200 లోపు అమ్ముడవుతున్న బేళ్లను, నో బీడ్ బేళ్లను కొనుగోలు చేయించడం మొదలుపెడితే మార్కెట్‌లో పోటీ పెరిగి కనీస సరాసరి ధర పెరుగుతుందని రైతులు అంటున్నారు. అప్పుడు కొంతవరకై నా తక్కువ నష్టాలతో బయట పడతామని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రుల ప్రకటనలతో కాలక్షేపం చేయకుండా రైతుల పక్షాన నిలబడాలని రైతు సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
గతంతో పోలిస్తే పతనం అంచున ధరలు..
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పొగాకు ధరలు బాగా పెరిగాయి. 2023–24 మార్కెటింగ్ సీజన్ మొత్తం సరాసరి అమ్మకం ధర కిలో రూ.288.65 పలికింది. అదే టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే అదికాస్తా 2024–25 మార్కెటింగ్ సీజన్ మొత్తం సరాసరి అమ్మకం ధర కిలోకు రూ.248.86 కు పడిపోయింది. ఈ ఏడాది 2025–26 జూలై నెలలో సరాసరి అమ్మకం ధర తేలిక నేలల్లో రూ.191.74, ఆగస్టు ఒకటో తేదీకి రూ.187.40కి పడిపోయింది. 7వ తేదీకి 181.67కు పతనమైంది. నల్లరేగడి నేలల్లో ఆగస్టు 7వ తేదీ వరకూ సరాసరి అమ్మకం ధర రూ.192.20గా ఉంది. ఒక్క ఒంగోలు రెండు వేలం కేంద్రాలు మినహా మిగిలిన కేంద్రాల్లో సరాసరి అమ్మకం ధర రూ.200 లోపే ఉంది. తిరస్కరణలకు సంబంధించి 11 వేలం కేంద్రాల్లో 31 శాతం నుంచి 36 శాతానికి పెరిగింది. ఫలితంగా రైతులు పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నారు.
ఈ ఏడాది తగ్గిన ఉత్పత్తి....
పొగాకు బోర్డు లెక్కల ప్రకారం గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఉత్పత్తి తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2024–25లో బోర్డు ద్వారా అమ్మిన పొగాకు 240.64 మిలియన్ కేజీలు. ఈ సంవత్సరం బోర్డు చెబుతున్న ఉత్పత్తి అంచనా 232 మిలియన్ కేజీలు. అంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఉత్పత్తి తగ్గిందని బోర్డు లెక్కలు చెబుతున్నాయి.
మార్క్‌ఫెడ్‌ను దింపిన వైఎస్ జగన్...
చరిత్రలో మొట్ట మొదటి సారిగా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మార్క్‌ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోళ్లు చేయించారు. దీంతో కంపెనీలు పోటీ పడి కొనుగోలు చేశాయి. ఫలితంగా పొగాకు రైతుల పాలిట బంగారంగా మారింది. ఇప్పుడు రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి లో బిడ్లను, నో బిడ్లను ముఖ్యమంత్రి ప్రకటించిన కనీస ధర రూ.200కు కొనుగోలు చేయిస్తే మార్కెట్‌లో పోటీ పెరిగి సరాసరి ధర పెరిగి రైతులు కొంత వరకై నా సంక్షోభం నుంచి బయట పడతారని రైతు సంఘాలు అంటున్నాయి. ఇది తప్ప ఇంకొక మార్గం లేదని స్పష్టం చేస్తున్నాయి.
52.57 మిలియన్ కేజీలు మాత్రమే కొనుగోలు...
పొగాకు రైతుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. వేలం ప్రారంభమై 110 రోజులు దాటినా ధరల్లో స్థిరత్వం కనిపించకపోగా.. కనిష్ట, సరాసరి ధరలు పతనమవుతున్నాయి. కొనుగోలు కంపెనీల మోసాకలకు అడ్డుకట్ట వేయాల్సిన పాలకులు హెచ్చరికలకే పరిమితమవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రులు పొగాకు బోర్డు కార్యాలయంలో సమావేశమై రైతులకు మెరుగైన ధరలు కల్పించాలని కంపెనీలకు సూచించిన రోజే ఒంగోలు–2 వేలం కేంద్రంలో ఎఫ్–5 రకం పొగాకు ధర కిలో రూ.130కి పడిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఒక వైపు కడుపుమండిన రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుంటే మరో వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు గొట్టిపాటి, స్వామి మాత్రం పొగాకు కంపెనీల యాజమాన్యాలకు ఉత్తుత్తి హెచ్చరికలు జారీ చేస్తున్నారని రైతు సంఘాలు మండిపడుతున్నాయి.
కేజీ రూ.300 కు కొనుగోలు చేస్తేనే గిట్టుబాటు
కేజీ పొగాకు రూ.300 కొనుగోలు చేస్తేనే గిట్టుబాటు ధర లభిస్తుంది. వ్యాపారులు కుమ్మకై ్క ధరలను దిగ్గోస్తున్నారు. కనిష్ట ధర సరాసరి కేజీ రూ.250 కి తగ్గితే నష్టం వాటిల్లుతుంది. రైతులు ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. మార్క్‌ఫెడ్ ను రంగంలోకి దించి పొగాకు కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసే బేళ్ల కన్నా తిరస్కరణ చేసే బేళ్లే ఎక్కువగా ఉన్నాయి. దాంతో అదనపు ఖర్చు రైతులపై పడుతుంది. వేలానికి తీసుకొచ్చే అన్ని బేళ్లను కొనుగోలు చేయాలి.
– కిరణ్, పొగాకు రైతు, కొండపి
ప్రభుత్వం పట్టించుకోవడం లేదు:
పొగాకు రైతులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మద్దతు ధర లేక ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు. గతంలో కేజీ రూ.360 కి కొనుగోలు చేసిన పొగాకును నేడు కేజీ రూ.200కి కూడా కొనడం లేదు. ఒక బ్యారన్‌కు దాదాపు రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. గతంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మార్క్ ఫెడ్ ను రంగంలోకి దించి రైతులను ఆదుకున్నారు. కూటమి ప్రభుత్వం కూడా రైతులను ఆదుకోవాలి. లేకుంటే రైతుల ఉసురు తగులుతుంది. – సురేష్, పొగాకు రైతు, కొండపి
ఉమ్మడి జిల్లాలో వేలం కేంద్రాలు ప్రారంభమై 110 రోజులు దాటిపోయింది. ఒంగోలు రీజియన్ పరిధిలో 11 వేలం కేంద్రాల పరిధిలో అధికారిక, అనధికారిక పొగాకు కలుపుకుని దాదాపు 130 మిలియన్ కేజీల వరకు అమ్మకాలు జరగాల్సి ఉంది. ఇప్పటి వరకు కేవలం 52.57 మిలియన్ కేజీలు మాత్రమే మార్కెట్లో వేలం జరిగింది. ఇంకా 78 మిలియన్ కేజీలు కొనుగోలు చేయాల్సి ఉంది. ఇదే గత సంవత్సరం 110 రోజుల్లో 111.29 మిలియన్ కేజీలు అమ్మకాలు జరిగాయి. త్వరలో కర్నాటకలో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. అదే జరిగితే వ్యాపారులు అక్కడికి వెళ్లిపోయే ప్రమాదం ఉంది.


