స్టైఫండ్‌పై మాట నిలబెట్టుకోండి | - | Sakshi
Sakshi News home page

స్టైఫండ్‌పై మాట నిలబెట్టుకోండి

Aug 12 2026 3:22 AM | Updated on Aug 12 2026 3:22 AM

● జూనియర్‌ డాక్టర్ల సంఘ జిల్లా అధ్యక్షుడు భార్గవ సాయి

ఒంగోలు టౌన్‌: జూనియర్‌ డాక్టర్లు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, స్టై ఫండ్‌ పెంపుపై ఇచ్చిన మాట నిలుపుకోవాలని జూనియర్‌ డాక్టర్ల సంఘ జిల్లా అధ్యక్షుడు జి.భార్గవ సాయి డిమాండ్‌ చేశారు. జీజీహెచ్‌ ఆవరణలో మంగళవారం జూనియర్‌ డాక్టర్లు సమ్మెకు దిగారు. స్టై ఫండ్‌ పెంచాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా భార్గవ సాయి మాట్లాడుతూ పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకనుగుణంగా స్టైఫండ్‌ పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఎప్పటి నుంచో స్టై ఫండ్‌ పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. ఇప్పటికే అనేక సార్లు తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళినా ప్రయోజనం లేకపోవడంతో అనివార్య పరిస్థితుల్లో సమ్మెకు దిగినట్లు వివరించారు. మొదటిరోజు సమ్మె తరువాత కూడా ఎలాంటి స్పందన లేకపోతే సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సమ్మె సందర్భంగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అత్యవసర సేవలు మినహా మిగిలిన వైద్య సేవలను నిలిపేసినట్లు వివరించారు. రెండో రోజు సాయంత్రం 4 గంటల వరకు వైద్య సేవలను నిలిపివేయనున్నట్లు తెలిపారు. ఆ తరువాత ప్రభుత్వ స్పందన కోసం సమయం ఇస్తామని, అయినా స్పందించకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని చెప్పారు. సామాన్య రోగులకు వైద్య సేవలు అందించే విషయంలో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ప్రభుత్వం జూనియర్‌ డాక్టర్ల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని కోరారు. ఈ సమ్మెలో జుడా కార్యదర్శి ఎస్‌. క్రిస్సికాంత్‌, ఫైజా పఠాన్‌, జీషిత, సుప్రియా తదితరులు పాల్గొన్నారు.

డాక్టర్‌ ప్రియాంకకు నివాళిగా కొవ్వొత్తుల ప్రదర్శన...

రాజమండ్రి యువ వైద్యురాలు డాక్టర్‌ ప్రియాంక మృతికి నివాళులు తెలుపుతూ జుడా ఆధ్వర్యంలో సాయంత్రం మెడికల్‌ కాలేజీ అసెంబ్లీ పాయింట్‌ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జోహార్‌ డాక్టర్‌ ప్రియాంక అంటూ నినాదాలు చేశారు. మద్యం మత్తులో వాహనంతో గుద్ది డాక్టర్‌ ప్రియాంక మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని జూనియర్‌ డాక్టర్లు డిమాండ్‌ చేశారు. నిందితులను కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న కథనాలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రియాంక కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement