● వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల పరిహారంపై టీడీపీ నేతల కన్ను ● రూ.లక్షకు రూ.10 నుంచి రూ.15 వేలు కమీషన్ డిమాండ్ ● సాంకేతిక సమస్యలు పరిష్కరించి పరిహారం ఇప్పిస్తామంటూ బేరాలు
మార్కాపురం: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఇచ్చిన పరిహారంపై టీడీపీ నాయకులు కన్నేశారు. కొంతమంది టీడీపీ నాయకులు బ్యాంకు మేనేజర్ల సాయంతో నిరక్షరాస్యుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని పరిహారంలో కొంత సొమ్ము నొక్కేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. పది రోజుల నుంచి గొట్టిపడియ, కలనూతల, సుంకేసుల గ్రామాల్లో టీడీపీ నాయకులు ఇదే పనిపై బిజీగా ఉంటున్నారు. ఇందుకు అనుకూలమైన ప్రాంతాలను ఎంపిక చేసుకుని నిర్వాసితులను అక్కడికి రప్పించుకుని సెటిల్‌మెంట్‌లు చేస్తున్నారు. మార్కాపురం పట్టణ శివారులోని తర్లుపాడు రోడ్డులో ఉన్న కేఫ్‌లను అడ్డాగా మార్చుకుంటున్నారు. లక్షకు రూ.పది నుంచి రూ.15 వేలు ఇస్తే మీకున్న సమస్యలను సెట్‌చేసి పరిహారం నగదు మీ ఖాతాల్లో జమచేయిస్తామని హామీ ఇస్తున్నారు. పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల్లోని 11 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. అయితే ఈ గ్రామాల్లో పలువురు నిరక్షరాస్యులకు బ్యాంకు నిబంధనలు తెలియకపోవడం, వారి అకౌంట్లు కేవైసీ కాకపోవడం, కొంతమంది పేర్లు తప్పుగా పడటం, మరికొంతమంది పేర్లు ఆధారు కార్డులో, బ్యాంకుల్లో వేరు వేరుగా ఉండటంతో వారి ఖాతాల్లో పరిహారం సొమ్ము జమయ్యేందుకు సాంకేతిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీన్ని ఆసరాగా చేసుకున్న టీడీపీ నాయకులు రంగ ప్రవేశం చేసి కమీషన్ ఇస్తే పరిహారం ఇప్పిస్తామని నమ్మబలుకుతున్నారు. ముఖ్యంగా మార్కాపురం మండలంలోని గొట్టిపడియ, పెద్దారవీడు మండలంలోని చింతలముడిపి గిరిజనుల నిరక్షరాస్యతను క్యాష్ చేసుకునేందుకు ఓ టీడీపీ నేత గత పది రోజులుగా బిజీగా ఉన్నాడు. ఇందుకు మార్కాపురం పట్టణంలోని కంభం రోడ్డులోని ఓ ప్రైవేటు బ్యాంకు మేనేజరు తనకు సహకారం అందిస్తున్నట్లు తెలిసింది. సాంకేతిక సమస్యను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం నుంచి వచ్చిన పరిహారాన్ని చింతలముడిపి చెంచు గిరిజనుల ఖాతాల్లో జమ చేయకుండా తాత్సారం చేస్తున్నారు. ప్రభుత్వం నెల రోజుల నుంచి విడతల వారీగా నష్టపరిహారాన్ని వారి బ్యాంకులకు జమ చేస్తోంది. ఇప్పటికి రూ.300 కోట్లు విడుదల చేయగా ఇంకా రూ.600 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. అయితే టీడీపీ దళారులు పరిహారం అందకుండా అడ్డుకుంటున్నట్టు తెలిసింది. కొంతమంది గిరిజనులు తమ తాండ అయిన చింతలముడిపి వదిలి వివిధ ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్తున్నారు. ఇదే సమయంలో వారి వివరాలు తెలుసుకున్న సదరు టీడీపీ నేత ఒక బ్యాంకు మేనేజరుతో మాట్లాడుకుని పరిహారంలో కమీషన్ దండుకునేందుకు ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలిసింది. సుంకేశుల గ్యాప్‌లో భాగంగా చింతలముడిపి తాండ మునిగిపోనుంది. దీంతోపాటు కాటంరాజు తాండలో కూడా గిరిజనుల నిరక్షరాస్యత, అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని అక్కడ కూడా ఒక కూటమి నేత డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. అధికారులు నేరుగా నిర్వాసితుల ఖాతాల్లో పరిహారం జమ చేయకపోతే బ్యాంకర్లు, టీడీపీ నేతల ఖాతాల్లోకి పరిహారం జమ కానుంది.


