కనిగిరిరూరల్: కేంద్రంలో, రాష్ట్రంలో మోదీ, చంద్రబాబు జోడి.. దోపిడీ పాలన సాగిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తీవ్రంగా ధ్వజమెత్తారు. సీపీఐ ప్రచార పాదయాత్ర ముగింపు సందర్భంగా .. ‘బద్లావ్ జరూరీ హై’..బహిరంగ సభ సోమవారం కనిగిరిలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక క్లబ్ రోడ్డులో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి సయ్యద్ యాసీన్ అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ 12 ఏళ్ల మోదీ పాలనలో దేశం అధోగతి పాలైందన్నారు. నిరుద్యోగులకు భద్రత, ఉపాధి కరువైందని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. రైతుల ఆత్మహత్యలు పెరిగాయని, కనీస మద్దతు ధర కరువైందన్నారు. 12 ఏళ్ల మోదీ పాలనలో 152 సార్లు దేశంలో ప్రశ్నా పత్రాలు లీక్ అయ్యాయని, ఎందరో నిరుద్యోగులు అన్యాయం అయ్యారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల పాలనలో మట్టి, మైనింగ్, మద్యం ఇలా రకాల దోపిడీలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి అంతా మాయగా అభివర్ణించారు. నిమ్జ్ నత్తనడకలో ఉందని, ట్రిపుల్ ఐటీలో కదలిక కరువైందని, పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పన అంతా కాగితాల్లోనే జరుగుతోందని విమర్శించారు.
పీపీపీ పేరుతో పేదవర్గాల
పీక నొక్కుతున్న చంద్రబాబు:
పీపీపీ విధానం పేరుతో చంద్రబాబు దోచుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారని ఈశ్వరయ్య విమర్శించారు. అందులో భాగంగానే పేదవర్గాలకు విద్యను దూరం చేసేలా మార్కాపురంలో మెడికల్ కాలేజీని పీపీపీ చేసేందుకు పన్నాగం పన్నుతున్నారన్నారు. రాష్ట్రంలోని 17 మెడికల్ కాలేజీలను పీపీపీ చేస్తే.. పేదలు వైద్య విద్యకు పూర్తిగా దూరమవుతారని చెప్పారు. ఇప్పటికే అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేటీకరణ చేస్తున్నారని, త్వరలో ఆర్టీసీని కూడా ప్రవేటు పరం చేస్తారని విమర్శించారు. చంద్రబాబు తన సీఎం సీటు తప్పా అన్నీ పీపీపీకి అప్పగిస్తారని ఎద్దేవా చేశారు. వెనుకబడిన మార్కాపురం జిల్లా అభివృద్ధికి రూ.25 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, రాష్ట్ర సమితి సభ్యులు సయ్యద్ యాసీన్, వై రవీంద్రబాబు మాట్లాడుతూ మార్కాపురం జిల్లా వర ప్రసాదిని వెలిగొండ ప్రాజెక్టు పూర్తికి ప్రభుత్వం తక్షణం రూ.5 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. పీసీపల్లి మండలాన్ని వెలిగొండ ప్రాజెక్టు పరిధిలో చేర్చాలన్నారు. తొలుత స్థానిక కామ్రెడ్ సయ్యద్ హనీఫ్ స్థూపం వద్ద నుంచి పట్టణ పుర వీధుల గుండా సభా స్థలి వరకు ఎర్ర జెండా చేతబూని ర్యాలీ చేశారు. కార్యక్రమంలో సయ్యద్ మౌలాలి, ఎస్‌కే గులాం హుస్సేన్, పందిటి మోహన్, పాలపర్తి మస్తాన్, ఎస్‌కే వై మస్తాన్, కరుణా నిధి, బృంగి సుబ్రహ్మణ్యం, పోతల ప్రభాకర్, సీహెచ్ పవన్ కళ్యాణ్, జీ బాలిరెడ్డి, ఎస్‌డీ ఆర్ట్ మోలాలి, తాహీద్, ఇఫ్రాజ్, తదితరులు పాల్గొన్నారు.


