● ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష,
కార్యదర్శులు పమిడి వెంకటరావు, జజ్జూరి జయంతిబాబు
ఒంగోలు టౌన్: ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వాకం వలన పొగాకు కొనుగోలు చేసే వారు లేకుండా పోయారని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పమిడి వెంకటరావు, జజ్జూరి జయంతిబాబు విమర్శించారు. స్థానిక ఎల్బీజీ భవనంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఇటీవల పొగాకు రైతులు జాతీయ రహదారుల దిగ్భందనం కార్యక్రమాన్ని చేపట్టిన సందర్భంలో సీఎం సమీక్ష చేసి ధరలను ప్రకటించారని వివరించారు. హై గ్రేడ్ పొగాకు కేజీ రూ.230, మీడియం గ్రేడ్ రూ.190, లో గ్రేడ్ రకం రూ.110 కొనుగోలు చేయాలన్న ప్రకటన వ్యాపారులకు మరింత స్వేచ్ఛనిచ్చినట్లు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది వ్యాపారులకు అనుకూలంగా ముఖ్యమంత్రి చేసిన ప్రకటనగా అభివర్ణించారు. ఇప్పటి వరకు ధరలు తగ్గించి కొనుగోలు చేస్తున్న వ్యాపారులు అప్పటి నుంచి అస్సలు మాట వినని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వరంగ సంస్థల చేత కొనుగోలు చేయించాలని కోరితే కేజీకి రూ.10 బోనస్ ఇస్తామని చెప్పడం రైతులను దారుణంగా మోసం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలు రీజియన్‌లో 142 మిలియన్ల కేజీలు కొనుగోలు చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు.
ధరలు అదుపు చేయడంలో కూటమి విఫలం
ఒంగోలు టౌన్: నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఐద్వా మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల రమాదేవి విమర్శించారు. స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో మంగళవారం ఐద్వా జిల్లా కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోక పోవడంతోపాటుగా కార్పొరేట్ అనుకూల విధానాలను అవలంబిస్తుండడంతో నిత్యావసర వస్తువుల ధరలు నింగినంటాయని చెప్పారు. బియ్యం ధరలు 40 నుంచి 50 శాతం పెరిగాయని, మినుములు ప్రతి కిలోకు 40 రూపాయల వరకు పెరిగిందని, ఉప్పు, పప్పు, వంట నూనెలు ప్రతి ఒక్కటీ 20 శాతానికి పైగానే పెరిగాయని వివరించారు. ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా నిత్యావసర వస్తువులను తక్కువ ధరలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అంత్యోదయ అన్నయోజన పథకంలో దేశంలో 9 కోట్ల మంది ఉన్నారని, ఇప్పటి వరకు వారికి 35 కేజీల బియ్యం ఇస్తుంటే ఇప్పుడు మోదీ కేవలం 7 కేజీల బియ్యం మాత్రమే ఇస్తుందని తెలిపారు. ప్రజలందరికీ ఆహార ధాన్యాలు, 16 రకాల నిత్యావసర వస్తువులను అందజేయాలని డిమాండ్ చేశారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు విద్యార్థి, యువజన సంఘాలతో కలిసి పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఎస్‌కే మున్వర్ సుల్తానా అధ్యక్షత వహించిన సమావేశంలో బి.రాజ్యలక్ష్మి, ఎస్‌కె మల్లికా, ఎం పద్మ, జి.ఆదిలక్ష్మి, గోవిందమ్మ పాల్గొన్నారు.


