మార్కాపురం:
వంటగ్యాస్ వినియోగదారులకు ఈకేవైసీ తప్పనిసరి చేస్తూ చమురు కంపెనీలు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సామాన్య ప్రజల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ నెల 15వ తేదీలోపు ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయని పక్షంలో భవిష్యత్తులో గ్యాస్ సిలిండర్ సరఫరా నిలిచిపోతుందన్న ప్రచారంతో వినియోగదారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఏజెన్సీల వద్దకు వెళ్లి బయోమెట్రిక్ వేయాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తుండటంతో సామాన్యులకు కష్టాలు తప్పడం లేదు.
వృద్ధులు, మహిళలకు నరకప్రాయం..
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 25,16,696 గ్యాస్ కనెక్షన్లు ఉండగా వాటిలో 53,396 ఈకేవైసీ చేయలేదు. గ్యాస్ కనెక్షన్లు అధికంగా మహిళల పేరు మీదే ఉండటంతో వారే నేరుగా గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్లాల్సి వస్తోంది. వయసు పైబడిన వారు, అనారోగ్యంతో బాధపడేవారు, కనీసం నడవలేని వృద్ధులు సైతం ఏజెన్సీల వద్ద పడిగాపులు కాస్తున్నారు. తీరా కష్టపడి అక్కడికి చేరుకున్నాక బయోమెట్రిక్ యంత్రాల్లో వేలిముద్రలు సరిపోలక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పదేపదే ఏజెన్సీల చుట్టూ తిరగలేక వృద్ధులు అవస్థలు పడుతున్నారు.
పనులొదులుకుని.. పడిగాపులు కాసి..
ఈకేవైసీ గురించి గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా పూర్తిస్థాయిలో అవగాహన లేదు. తీరా విషయం తెలిసి ఏజెన్సీల వద్దకు వస్తే అక్కడేమో సర్వర్ సమస్య వేధిస్తోంది. వందలాది మంది ఒకేసారి రావడంతో సాంకేతిక సమస్యలు తలెత్తి గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. దీంతో రోజువారీ కూలీలు, చిరుద్యోగులు తమ పనులు వదులుకుని మరీ క్యూ లైన్లలో నిలబడాల్సి వస్తోంది. ఈకేవైసీ పేరుతో గ్యాస్ కనెక్షన్ కట్ చేస్తే ప్రత్యామ్నాయంగా మళ్లీ కట్టెల పొయ్యే దిక్కవుతుందని, ముఖ్యంగా గ్యాస్ మీదే ఆధారపడే పట్టణవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
గ్రామాల్లో క్యాంపులకు డిమాండ్
హడావుడిగా గడువు పెట్టి భయభ్రాంతులకు గురిచేసే కంటే, ముందుగా ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని వినియోగదారులు కోరుతున్నారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, గ్రామాల వారీగా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ఈకేవైసీ ప్రక్రియను సులభతరం చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రకాశం జిల్లాలో గ్యాస్ కనెక్షన్లు
14,93,872
ఈకేవైసీ చేయనివి 25,835
మార్కాపురం జిల్లాలో గ్యాస్ కనెక్షన్లు 10,22,824
ఈకేవైసీ చేయనివి 25,561
15వ తేదీలోగా ఈకేవైసీ చేసుకోకుంటే కనెక్షన్ కట్!
తీవ్ర ఆందోళనలో వంటగ్యాస్ వినియోగదారులు
సర్వర్ల సమస్యలతో ఏజెన్సీల వద్ద గంటల తరబడి పడిగాపులు
పడని వేలిముద్రలు.. వృద్ధులు, మహిళలకు తప్పని తిప్పలు..
గ్రామాల వారీగా ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని డిమాండ్
15లోగా ఈకేవైసీ పూర్తి చేయాల్సిందే..
గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ఉన్న ప్రతి కుటుంబం తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలి. లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు పడతారు. ప్రస్తుతం ఎవరి పేరుపై కనెక్షన్ ఉంటే వారే నేరుగా గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి ఆధార్ నంబర్ నమోదు చేయించి, వేలిముద్రలు వేసి ఈకేవైసీ పూర్తి చేయాలి. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలి.
– డి.అంకయ్య, జిల్లా పౌరసరఫరాల అధికారి, మార్కాపురం


