కొడుకు కోసం.. భార్యను కడతేర్చి.. | - | Sakshi
Sakshi News home page

కొడుకు కోసం.. భార్యను కడతేర్చి..

Aug 12 2026 3:22 AM | Updated on Aug 12 2026 3:22 AM

కురిచేడు: మండలంలోని కల్లూరు గ్రామ శివారు పొలాల్లో ఇటీవల జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కన్న కొడుకును తనకు దూరం చేస్తోందనే కోపంతో కట్టుకున్న భార్యనే భర్త పక్కా పథకం ప్రకారం బండరాయితో మోది దారుణంగా హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. మంగళవారం దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ, సీఐ రామారావు సమక్షంలో కురిచేడు ఎస్సై జి.కోటయ్య నిందితుడి వివరాలు మీడియాకు వెల్లడించారు.

కొడుకు కోసం మొదలైన గొడవలు..

దొనకొండ మండలం చందవరం గ్రామానికి చెందిన వేల్పుల రవణమ్మకు పాపిరెడ్డిపల్లికి చెందిన పెద్దిబోయిన వెంకటేశ్వర్లుతో సుమారు 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు అవినాష్‌ ఉన్నాడు. ఐదేళ్లపాటు అన్యోన్యంగా ఉన్న దంపతుల మధ్య కలహాలు మొదలయ్యాయి. దీంతో మానసిక ఒత్తిడికి గురైన రవణమ్మ.. కొడుకును తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు ఆమెకు గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స చేయిస్తున్నారు. వెంకటేశ్వర్లు అప్పుడప్పుడూ అత్తగారింటికి వెళ్లి వస్తున్నప్పటికీ, కొడుకును మాత్రం పంపేవారు కాదు. గత జూన్‌లో చందవరం వెళ్లిన వెంకటేశ్వర్లు.. తన కొడుకును తనతో పంపాలని భార్య, అత్తమామలు, బావమరిది మల్లికార్జునను కోరాడు. వారు ససేమిరా అనడంతో.. కొడుకును అప్పగించకపోతే భార్యను చంపేస్తానని బెదిరించి వచ్చాడు.

పథకం ప్రకారం నమ్మించి..

జూలై 31న రవణమ్మ తమ్ముడు మల్లికార్జున ఆమెను తీసుకొచ్చి భర్త వద్ద వదిలిపెట్టాడు. అయితే కొడుకును తీసుకురాలేదనే కోపంతో దంపతుల మధ్య మళ్లీ గొడవ జరిగింది. దీంతో ఈ నెల 4న ఉదయం 8 గంటలకు భర్తకు చెప్పకుండా రవణమ్మ పుట్టింటికి బయలుదేరింది. గమనించిన వెంకటేశ్వర్లు వెతుక్కుంటూ వెళ్లి కనిగిరి బస్టాండ్‌ వద్ద ఆమెను కలిశాడు. తానే స్వయంగా బైక్‌పై పుట్టింటి వద్ద దించుతానని నమ్మించాడు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో బైక్‌పై బయలుదేరి కొనకనమిట్ల, దొనకొండ మీదుగా చందవరం వస్తూ.. కల్లూరు గ్రామ పరిధిలోని ఎన్‌ఎస్‌పీ కెనాల్‌ వద్ద పొలాల్లో గొర్రెల బేరం మాట్లాడుకుని వెళ్దామని నమ్మించాడు. సాయంత్రం 4 గంటల సమయంలో కెనాల్‌ దాటిన తర్వాత మధుసూదన్‌ రెడ్డికి చెందిన పొలంలోని ఎరువుల షెడ్డు వద్దకు తీసుకెళ్లాడు. భార్య అక్కడే చీర పరుచుకుని పడుకోగా, నిద్రలోకి జారుకున్న విషయాన్ని గమనించిన వెంకటేశ్వర్లు.. పక్కనే ఉన్న బండరాయిని రెండు చేతులతో ఎత్తి ఆమె తలపై బలంగా వేశాడు. రవణమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, నిందితుడు అక్కడినుంచి పాపిరెడ్డిపల్లికి పరారయ్యాడు.

మృతురాలి తల్లి వేల్పుల ఆదిలక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కొడుకును తనకు దక్కకుండా అడ్డుపడుతున్న భార్యను చంపేస్తే గొడవలు ఉండవనే ఉద్దేశంతోనే నిందితుడు పక్కా ప్లాన్‌ ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. గుంటూరు పారిపోయేందుకు యత్నిస్తున్న వెంకటేశ్వర్లును మంగళవారం కురిచేడు–పడమటి గంగవరం రోడ్డులోని పెట్రోల్‌ బంక్‌ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై వివరించారు. కార్యక్రమంలో ఏఎస్‌ఐ మోహనరావు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

కల్లూరు వద్ద మహిళ హత్య కేసు మిస్టరీ ఛేదన

నిందితుడి అరెస్టు.. వివరాలు వెల్లడించిన పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement