మార్కాపురం: జిల్లా విద్యాశాఖ కార్యాలయం సిబ్బంది కొరతతో సతమతమవుతోంది. మార్కాపురం జిల్లా ఏర్పడి 8 నెలలు కావస్తున్నా తగినంత మంది సిబ్బందిని నియమించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది జనవరి మొదటి వారంలో మార్కాపురం మండలంలోని దరిమడుగు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తాత్కాలికంగా డీఈఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలోని 1,328 పాఠశాలలు, 90,621 మంది విద్యార్థులకు సంబంధించిన విద్యా వ్యవహారాలను ఇక్కడి నుంచే పర్యవేక్షించాల్సి ఉంటుంది.
ఉండాల్సింది 46 మంది.. పనిచేసేది ఇద్దరే!
కార్యాలయంలో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు (ఏడీలు), నలుగురు సూపరింటెండెంట్లు, 20 మంది సీనియర్ అసిస్టెంట్లు, 26 మంది జూనియర్ అసిస్టెంట్లు, ఇతర ఆఫీసు సబార్డినేట్లు ఉండాలి. సుమారు 46 మంది సిబ్బంది అవసరం కాగా.. ప్రస్తుతం డీఈఓతో కలిపి కేవలం ఆరుగురు మాత్రమే ఉన్నారు. ప్రధానంగా 46 మంది చేయాల్సిన పనిని డీఈఓ, మరో ఉద్యోగి మాత్రమే నిర్వర్తిస్తుండటంతో వారిపై తీవ్ర పనిభారం పడుతోంది.
పనుల్లో తీవ్ర జాప్యం
సిబ్బంది లేమి కారణంగా రోజువారీ కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. దీంతో పాటు పలు కీలక వ్యవహారాల్లో జాప్యం జరుగుతోంది. ముఖ్యంగా ఉపాధ్యాయుల సర్వీసు వ్యవహారాలు, మధ్యాహ్న భోజన పథకం పర్యవేక్షణ, సర్వేపల్లి రాధాకృష్ణ కిట్ల పంపిణీ, విద్యార్థుల డేటా అప్‌డేట్, ప్రభుత్వానికి పంపాల్సిన నివేదికల తయారీ తదితర పనులు మందకొడిగా సాగుతున్నాయి.
సవాల్‌గా టెట్ పరీక్షలు
ఈ నెల 16వ తేదీ వరకు నిర్వహిస్తున్న టెట్‌కు డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ల నియామకం, పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడం అధికారులకు కత్తి మీద సాములా మారింది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే డీఈఓ కార్యాలయంలో సిబ్బందిని నియమించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.


