ఒంగోలు సిటీ: సెప్టెంబరు 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ సి.వి.రేణుక మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కనీసం పదేళ్ల సర్వీసు పూర్తి చేసి, ఎలాంటి సివిల్, క్రిమినల్, శాఖాపరమైన కేసులు లేని ప్రభుత్వ, జెడ్పీ, ఎంపీపీ, మున్సిపల్, ఎయిడెడ్, మోడల్ స్కూల్స్, గురుకులాలు, కేజీబీవీ, డైట్ కళాశాలల ఉపాధ్యాయులు ఇందుకు అర్హులన్నారు. దరఖాస్తులను నేరచరిత్ర లేదని తెలిపే ధ్రువీకరణ పత్రాలతో జతచేసి ఈ నెల 18లోగా ఎంఈఓలకు అందజేయాలన్నారు. ఎంఈఓలు వాటిని పరిశీలించి 20వ తేదీలోగా ఉప విద్యాశాఖాధికారులకు, అక్కడి నుంచి 22వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు డీఈఓ కార్యాలయానికి పంపాలని సూచించారు. గడువు దాటిన తర్వాత వచ్చే ప్రతిపాదనలు స్వీకరించబోమని స్పష్టం చేశారు.
సింగరాయకొండ: మొక్కు తీర్చుకునేందుకు కుటుంబంతో సహా అన్నవరం వెళ్లగా.. గుర్తుతెలియని దుండగులు ఇంటి దొడ్డి దారి గుండా చొరబడి చోరీకి యత్నించిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. స్థానిక మినీ బైపాస్ రోడ్డులోని శిఖాకొల్లువారి వీధికి చెందిన కొత్తూరి రాధాకృష్ణమూర్తి కుటుంబంతో కలిసి ఈనెల 6న అన్నవరం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లారు. మంగళవారం ఉదయం పనిమనిషి వచ్చి చూడగా, వెనుక దొడ్డి తలుపులు పగులగొట్టి ఉండటాన్ని గమనించి చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చింది. విషయం తెలుసుకున్న రాధాకృష్ణమూర్తి వచ్చి చూడగా, లోపల బీరువా ధ్వంసమై వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. మొదట 48 గ్రాముల బంగారం, రూ.1.20 లక్షల నగదు పోయినట్లు ప్రచారం జరిగినప్పటికీ.. చివరకు తమ ఇంట్లో ఎలాంటి నగదు, విలువైన వస్తువులు పోలేదని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలంలో ఎస్సై సుధీర్‌కుమార్ క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. సీసీ ఫుటేజీలు పరిశీలిస్తే నిందితులు ఎవరనేది తెలుస్తుందని పోలీసులు భావిస్తున్నారు.


