డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి | - | Sakshi
Sakshi News home page

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి

Jul 27 2026 2:18 AM | Updated on Jul 27 2026 2:18 AM

లోకేష్‌ కాదు లీకేష్‌ ఏపీలో కూడా మరో కాక్రోచ్‌ ఉద్యమం విద్యాశాఖామంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలి మాజీ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ డిమాండ్‌

సింగరాయకొండ: డీఎస్సీ పరీక్షల్లో తీవ్ర అవకతవకలు జరిగాయని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖా మంత్రి నారా లోకేష్‌ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, సీబీఐ విచారణ జరిపించాలని లేని పక్షంలో ఏపీలో కూడా మరో కాక్రోచ్‌ ఉద్యమం పుట్టుకొస్తుందని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి, పీఏసీ సభ్యుడు డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ అన్నారు. స్థానిక వైఎస్సార్‌ సీపీ క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడారు. విద్యాశాఖా మంత్రి లోకేష్‌ కాదు లీకేష్‌ అని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం డీఎస్సీ నిర్వహణలో నిబంధనలను పక్కనబెట్టి గోప్యతను దెబ్బతీస్తూ అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారని ఆరోపించారు. కేంద్రంలో నీట్‌ వ్యవహారంలో అనుసరించిన తీరుగానే ఇక్కడ కూడా లోకేష్‌ రాజీనామా చేసి డీఎస్సీ స్కాంపై స్వతంత్ర సంస్థ అయిన సీబీఐ తో పూర్తిస్థాయి విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు.

డీఎస్సీలో పారదర్శకత శూన్యం:

వైఎస్‌ జగన్‌ హయాంలో విద్యాశాఖకు, నేటి కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ పనితీరుకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. డీఎస్సీ పరీక్షల్లో ప్రధానంగా గోప్యత, పారదర్శకత ఎక్కడా లేదన్నారు. ప్రశ్నపత్రం తయారుచేసే వ్యవస్థ, పరీక్షలు నిర్వహించే వ్యవస్థ రెండూ వేర్వేరుగా ఉండాలి. కానీ రెండింటినీ కలపడంతో గోప్యత లేకుండా పోయిందన్నారు. ఎవరైతే ప్రశ్నపత్రాలు అప్‌లోడ్‌ చేశారో వారికి ఫస్ట్‌ ర్యాంకులు రావటం దేనికి సంకేతమని ప్రభుత్వాన్ని నిలదీశారు.

డైవర్షన్‌ పాలిటిక్స్‌ ఆపాలి:

డీఎస్సీ వంటి ప్రాధాన్యత కలిగిన అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని సురేష్‌ ఆరోపించారు. విద్యాశాఖా మంత్రిగా ఉన్న లోకేష్‌ ఇంతవరకు డీఎస్సీ పరీక్షల మీద వచ్చిన ఆరోపణలపై ఒక్కసారి కూడా ప్రెస్‌మీట్‌ పెట్టలేదని విమర్శించారు. అధికారులచేత ఏదో ఒకటి సమాధానం చెప్పించి ఈ విషయాన్ని ముగించాలని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సకల శాఖా మంత్రిగా చలామణి అవుతున్న లోకేష్‌ తన శాఖలో జరిగిన స్కామ్‌ పై ఎందుకు నోరు మెదపరని, ఇతను లోకేష్‌ కాదని ముమ్మాటికీ లీకేష్‌ అని ఎద్దేవా చేశారు.

గవర్నర్‌ దృష్టికి వందల ఆధారాలు, కేసులు:

డీఎస్సీలో జరిగిన అవకతవకలపై ఆధారాలు, సాక్ష్యాలు గల వీడియో టేపులతో సహా పోస్టులను ఏవిధంగా అమ్ముకున్నారో గవర్నర్‌కు పూర్తి ఆధారాలు అందజేశామన్నారు. ఇప్పటికే కోర్టులో ఈ వ్యవహారంపై సుమారు 400 కేసులు నమోదయ్యాయని సాక్షాత్తు గవర్నర్‌ స్వయంగా చెప్పారన్నారు. ఇన్ని కేసులు ఉన్నందున ఇది న్యాయపరమైన అంశమని సంవత్సరాల తరబడి కష్టపడి చదివిన అభ్యర్థులు, వారి తల్లిదండ్రుల త్యాగాలను కూటమి ప్రభుత్వం నీరు గార్చిందన్నారు. తమకు నచ్చిన అభ్యర్థులు ఎంపిక అయ్యే వరకు గేట్లు ఎత్తి తర్వాత మూసేశారని దుయ్యబట్టారు.

జీవోలతో స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు:

జీవో నెంబరు 4, 47 ల ద్వారా డీఎస్సీ పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారని, ఇది క్షమించరాని నేరమని ఆదిమూలపు సురేష్‌ దుయ్యబట్టారు. రాజకీయంగా టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి, ఆ సర్టిఫికెట్ల వ్యాలిడిటీ, అథెంటిసిటీ కూడా వెరిఫై చేయకుండా స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ వారు ఇచ్చిన సర్టిఫికెట్ల ఆధారంగా ఉద్యోగాలు కల్పించారని, ఆ తర్వాత ఆ జోవోలు కనబడకుండా చేసి మళ్లీ జీవో నెంబరు 56 ద్వారా నిబంధనలు మార్చారని, ఇలా స్పష్టమైన తప్పు చేయటమే కాకుండా వ్యవస్థలను చిన్నాభిన్నం చేశారని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement