ఘనంగా కోటయ్య 111వ జయంతి వేడుకలు నివాళులర్పించిన డీఆర్‌ఓ వెంకటరమణ
ఒంగోలు సబర్బన్:
చేనేత కార్మికుల సంక్షేమానికి, హక్కుల సాధనకు జీవితాంతం కృషి చేసిన మహనీయుడు ‘ప్రజాబంధు’ ప్రగడ కోటయ్య అని జిల్లా రెవెన్యూ అధికారి పి.వెంకట రమణ కొనియాడారు. ఒంగోలు కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో ఆదివారం ప్రసిద్ధ ప్రజా నాయకుడు, ‘ప్రజాబంధు’ ప్రగడ కోటయ్య 111వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఆర్‌ఓ పి.వెంకట రమణ ముఖ్య అతిథిగా హాజరై ప్రగడ కోటయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకట రమణ మాట్లాడుతూ ప్రగడ కోటయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా చేనేత రంగానికి, నిరుపేద చేనేత కార్మికుల సంక్షేమానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. సహకార రంగాన్ని బలోపేతం చేయడంలో, ‘ఆప్కో’ స్థాపనలో ప్రగడ కోటయ్య అత్యంత కీలక పాత్ర పోషించారని డీఆర్‌ఓ గుర్తు చేశారు. సుమారు 16 వేల ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేయించడంతో పాటు, చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక నిధి, బదులు భూ వసతి, విద్యుత్ మగ్గాల నియంత్రణ చట్టం తెచ్చేలా ప్రభుత్వాన్ని ఒప్పించిన ధీశాలి అని ప్రశంసించారు. చీరాలలో ఆంధ్ర కేసరి ప్రకాశం జూనియర్ కళాశాల, ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేశారని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఏడీ బి.రామయ్య, డీఓ ఎ.వెంకటేశ్వర్లు, ఏడీఓ టి.వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ సిబ్బంది, చేనేత విభాగాధికారులు, వివిధ వర్గాల ప్రముఖులు పాల్గొని ప్రగడ కోటయ్య సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు.


