చెరుకూరులో దారుణం | - | Sakshi
Sakshi News home page

చెరుకూరులో దారుణం

Jul 27 2026 2:18 AM | Updated on Jul 27 2026 2:18 AM

పొన్నలూరు: రాష్ట్రంలో టీడీపీ శ్రేణుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తాము ఏమి చేసిన అడిగేవారు లేరంటూ అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడుతూ సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అధికారం ఉందనే అహంకారంతో చివరికి ఇళ్లను సైతం కూల్చుతూ దాడులకు పాల్పడుతున్నారు. ఈ సంఘటన మండలంలోని చెరుకూరులో జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. చెరుకూరు గామానికి చెందిన కుంచాల నరసింహం 30 ఏళ్ల కిత్రం తన అన్న పెద్దమాలకొండయ్య వద్ద అప్పటి మార్కెట్‌ ధర ప్రకారం రూ.6 వేలు చెల్లించి నాలుగు సెంట్లు ఇంటి స్థలాన్ని తీసుకున్నాడు. ఇద్దరు అన్నదమ్ములు కావడంతో అప్పటి పద్ధతి ప్రకారం ఎలాంటి రాతలు లేకుండా నోటిమాట మీద స్థలం కొనుగోలు చేశాడు. దీంతో తరువాత ఆ స్థలంలో చిన్నపాటి ఇల్లును నిర్మించుకవని తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో రమారమి 1993లో అప్పటి ప్రభుత్వం వారు పక్కా గృహం మంజూరు చేయడంతో నరసింహం వంద గజాల స్థలంలో పక్కా గృహం నిర్మిచుకున్నాడు. కొన్ని రోజుల తరువాత నరసింహం, అతని భార్య రవణమ్మ వృద్ధాప్యంతో మరణించారు. ఈ క్రమంలో వారసత్వంగా అనుభవం కలిగి ఆ ఇంటిలో నరసింహం కుమారుడైన కుంచాల మాధవరావు తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. అయితే వీరు బతుకుదెరువు కోసం హైదరాబాద్‌ ప్రాంతానికి వలస వెళ్లి కూలీపనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. మధ్యలో అప్పుడప్పుడు పండుగలు, శుభకార్యాలకు ఇంటికి వచ్చి తమ పనులు అయిపోయిన తరువాత వెళ్లిపోతుంటారు. అయితే ఇటీవల చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడటంతో మాధవరావు ఇల్లు, స్థలంపై తన పెద్దనాన్న కుమారుడైన కుంచాల మాల్యాద్రి కన్ను పడింది. మాధవరావు కుటుంబ సభ్యులు కూలీ పనుల కోసం హైదరాబాద్‌లో ఉండటంతో ఎలాగైనా ఇల్లు, స్థలాన్ని ఆక్రమించుకోవాలని స్థానిక టీడీపీ నాయకుల సహకారం కోరాడు. దీంతో వారి ఏమైనా సరే మేము చూసుకుంటామని హమీ ఇవ్వడంతో ఇల్లు కూల్చి వేయడానికి పూనుకున్నాడు.

పొక్లెయిన్‌తో ఇల్లు కూల్చివేత...

అధికారపార్టీ నాయకుల నుంచి కుంచాల మాల్యాద్రికి హామీ రావడంతో ఎప్పుడో 30 ఏళ్ల క్రితం నిర్మించిన ఇంటిని పొక్లెయిన్‌తో ఈ నెల 20న సోమవారం ఇంటిని పూర్తిగా కూల్చివేశాడు. ఆ తరువాత ట్రాక్టర్‌ సహాయంతో కూల్చిన ఇటుకలు, ఇంటి లోపల ఉన్న గృహోపకరణాలను తొలగించి ఇంటి ఆనవాళ్లు లేకుండా చదును చేశాడు. దీంతో గ్రామంలోని తన బంధువులు ద్వారా విషయం తెలుసుకున్న బాధితుని కుటుంబ సభ్యులు గ్రామానికి చేరుకోని బోరున విలపించారు. ఇల్లు కూల్చడంపై మాల్యాద్రి కుటుంబ సభ్యులను నిలదీసి ప్రశ్నించడంతో ఈ స్థలం మాది నీ దిక్కున్నచోట చెప్పుకోండంటూ దాడికి ప్రయత్నించారని బాధితులు వాపోయారు. తన ఇంటిని కూల్చివేయడం వలన సుమారుగా 10 లక్షలు నష్టపోయినట్టు బాధితుడు తెలిపాడు.

ఫిర్యాదు తీసుకోని పోలీసులు...

వాస్తవంగా తాము లేని సమయంలో తన ఇంటిని కూల్చిన విషయాన్ని మాధవరావు గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని కోరాడు. అయితే ఇంటిని కూల్చిన మాల్యాద్రి కుటుంబ సభ్యులు గ్రామ పెద్దల మాటను పట్టించుకోకపోవడంతో బాధితుడి పొన్నలూరు పోలీసులను ఆశ్రయించాడు. అయితే అప్పటికే అధికారపార్టీ పెద్దల నుంచి పోలీసులకు ఆదేశాలు రావడంతో ఫిర్యాదును పోలీసులు తీసుకోకుండా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. రెండుసార్లు పోలీస్‌స్టేషన్‌ చుట్టూ తిరిగిన పోలీసులు పట్టించుకోలేదని బాధితుడు వాపోయాడు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement