విచ్చలవిడిగా ఇసుక దోపిడీ నదులు, వాగుల్లో అక్రమంగా పొక్లెయిన్‌లతో తవ్వకాలు ట్రక్కు రూ.3వేల నుంచి రూ.4 వేలకు విక్రయాలు
అద్దంకి:
నదీ గర్భాలను ఇసుకాసురులు చెరబట్టారు. అధికార పార్టీ అండతో ఇసుకను దోచుకుంటూ నదులకు గర్భ శోకం కలిగిస్తున్నారు. రాత్రి సమయాల్లో, ఎవరూ లేని నిర్మానుష్య ప్రాంతాల్లోని నదులు, వాగుల వద్ద పొక్లెయినర్లతో ఇసుకను తవ్వి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. అద్దంకి, బల్లికురవ, సంతమాగులూరు మండలాల పరిధిలో వాగులు, నదులు ఉన్నాయి. వాటి లో అద్దంకి, బల్లికురవ మండలాల పరిధిలోని గుండ్లకమ్మ నదిలో ఇసుక తవ్వి తరలిస్తున్నారు. అద్దంకి మండలంలోని గోపాలపురం, తిమ్మాయపాలెం, రామాయపాలెం, వేలమూరిపాడు, బల్లికురవ మండలంలోని వెలమవారిపాలెం, సంతమాగులూరులోని గురిజేపల్లి సమీపంలోని వలేరు వాగుల్లో ఇసుకను ఇసుకాసులు పొక్లెయిన్‌లతో, ట్రక్కులతో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
అధికార పార్టీ అండ..
పొక్లెయినర్‌తో ఇసుక తవ్వి తరలించే వారికి అధికార పార్టీ అండ ఉందని స్థానికులు చెబుతున్నారు. లేకుంటే ఇంత విచ్చలవిడిగా తవ్వకాలు జరుగుతాయనే విమర్శలు లేకపోలేదు. ఈ క్రమంలో అధికారులు సైతం మిన్నకున్నారనే ఆరోపణలున్నాయి.
ఊట బావుల వద్ద ఇసుక తవ్వకాలు..
అద్దంకి, తిమ్మాయపాలెం, రామాయపాలెం తదితర గ్రామాలకు తాగునీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన ఊటబావుల వద్ద సైతం ఇసుక ఎత్తుతుండడంతో ఊట బావుల్లో నీటి ఊట తగ్గిపోయి తాగునీటి ఇబ్బందులు ఏర్పడతాయని పలుసార్లు ప్రజలు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు చెప్పినా ఫలితం లేదు. దాంతో వారు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది.
ఇసుక రీచ్ లేకుండా తవ్వకాలు..
వాల్టా చట్టం ప్రకారం ఇసుక నిల్వలు సరైన లోతులో లేని చోట ఇసుక రీచ్‌లు కేటాయించలేదు. అందులో అద్దంకి నియోజకవర్గంలోని గుండ్లకమ్మ నది, ఇతర మండలాల్లో వాగులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ నదులు, వాగుల వద్ద ఇసుక తోడేయడంతో భూగర్భ జలాలు పూర్తిగా అడుగుంటే ప్రమాదం ఉంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు పట్టించుకుని ఇసుకాసురుల ఆట కట్టించాలని స్థానికులు కోరుతున్నారు.


