న్యూస్‌రీల్
చెత్త పన్నుల సొమ్ము ఏమైపోతుందో...
కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
జాతీయ స్థాయి షార్ట్ బాల్ పోటీలకు విద్యార్థినులు
ఉమామహేశ్వరపురం అగ్రహారం ఉన్నత పాఠశాల బాలికల ప్రతిభ
6వ తరగతి ప్రవేశ పరీక్షకు 861 మంది హాజరు
ఒంగోలు కార్పొరేషన్‌లో కీలక అధికారి వసూళ్ల పర్వం పాలక వర్గం గడువు ముగియడంతో రెచ్చిపోతున్న వైనం నేనే రాజు నేనే మంత్రినంటూ యథేచ్ఛగా అవినీతికి పాల్పడుతున్నట్లు గుసగుసలు ఇంజినీరింగ్ పనుల్లో 5 శాతం కమీషన్ ఇవ్వాలంటూ హుకుం అపార్ట్‌మెంట్ల అనుమతులకు భారీగా వసూళ్లు చెత్త పన్ను వసూళ్లలోనూ చేతివాటం నాలుగు విభాగాలకు టార్గెట్ పెట్టి మామూళ్ల వసూళ్లు కార్పొరేషన్‌కు చేరాల్సిన ఆదాయాన్ని దారి మళ్లిస్తున్నట్లు ఆరోపణలు
ఒంగోలు కార్పొరేషన్‌లో తవ్వేకొద్దీ రోజుకో అవినీతి వ్యవహారం బయటపడుతోంది. ఏ విభాగాన్ని కదిలించినా పైసా వసూళ్లు ఎక్కువైపోయాయి. ఓ కీలక అధికారి అన్నీ తానై అపార్ట్‌మెంట్ల అనుమతుల దగ్గర నుంచి చెత్తపన్ను వసూళ్ల వరకూ ఏ విభాగాన్నీ వదలకుండా టార్గెట్లు పెట్టి మరీ కమీషన్లు బొక్కుతున్నాడు. నిన్నా మొన్నటి వరకు ప్రజలు ఎన్నుకున్న పాలక వర్గం ఉండేది. ఇప్పుడు పాలక వర్గం గడువు ముగియడంతో కార్పొరేషన్లో సదరు అధికారి రెచ్చిపోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. నేనే రాజు నేనే మంత్రినంటూ యథేచ్ఛగా అవినీతికి పాల్పడుతున్నట్లు క్షేత్రస్థాయి ఉద్యోగులు చెవులు కొరుక్కుంటున్నారు.
సాక్షి టాస్క్‌ఫోర్స్:
పాలకవర్గం లేదు..ఇక అడిగేదెవరు అన్నట్లు ఒంగోలు కార్పొరేషన్‌లో ఓ కీలక అధికారి అందినకాడికి దండుకుంటున్నాడు. కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, శానిటేషన్, ఇంజినీరింగ్ విభాగాల్లో పనిచేస్తున్న తనకు అనుకూలమైన చిరుద్యోగులను బినామీలుగా ఏర్పాటు చేసుకొని ముడుపులు వసూలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. పైసలు ఇస్తే సరేసరి లేకపోతే నిబంధనల పేరిట ఇబ్బందులు పెడుతూ నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాంతో పదో పరకో ఇచ్చుకొని బయటపడుతున్నట్లు తెలుస్తోంది. నగరాభివృద్ధిలో పోటీ పడాల్సిన నగర పాలక సంస్థ అవినీతిలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉందని, ఇందుకు ఏసీబీ దాడుల్లో పట్టుబడిన నగదే నిదర్శనమని జనం అంటున్నారు.
భవన నిర్మాణాలకు రూ.20 లక్షలు
జిల్లా కేంద్రమైన ఒంగోలు శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. వ్యవసాయరంగం దెబ్బతినడంతో ఉన్న పొలాలు అమ్ముకొని పలువురు రైతులు, చుట్టుపక్కల గ్రామాల నుంచి ఒంగోలు వచ్చి స్థలాలు కొనుక్కొని ఇళ్లు నిర్మించుకుంటున్నారు. దీంతో కొందరు భవన నిర్మాణాల వ్యాపారులు అపార్ట్‌మెంట్లు నిర్మించి విక్రయాలు చేస్తున్నారు. అయితే అపార్ట్‌మెంట్లు నిర్మించాలంటే ముందుగా నగర పాలక సంస్థ నుంచి అనుమతులు కావాల్సి ఉంటుంది. అనుమతులు లేకుండా భవనాలు నిర్మించుకుంటే ఆ తరువాత ఇబ్బందులు పడకతప్పదు. దీన్ని అసరా చేసుకొని సదరు కీలక అధికారి భారీ వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఒక్కో భవన నిర్మాణానికి గాను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు భారీగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బాధ్యతలు చేపట్టిన సదరు కీలక అధికారి మధ్యవర్తుల ద్వారా ఈ 20 నెలల్లోనే సుమారు రూ.2 కోట్లకు పైగా మామూళ్లు వసూలు చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో భవన నిర్మాణాలు చేయాలంటే భయపడిపోతున్నారు. రాజకీయ పలుకుబడి కలిగిన వ్యక్తులు తప్ప మిగిలిన సామాన్యులు భవన నిర్మాణాలను వాయిదా వేసుకుంటున్నారు.
5 శాతం కమీషన్ ఇవ్వాల్సిందేనని మంకుపట్టు...
నగరంలో ఇంజినీరింగ్ విభాగంలో అనేక పనులు జరుగుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు ఈ పనుల్లో వసూలు చేసిన మామూళ్లను అధికార పార్టీకి చెందిన కొందరు కార్పొరేటర్లకు వాటాలు పంచడంతో పాటుగా ఈ కీలక అధికారి 2 శాతం కమీషన్లు తీసుకునేవాడని సమాచారం. అయితే మార్చి నెల 17వ తేదీ నగర పాలక వర్గం గడువు ముగిసింది. ఇప్పుడు కార్పొరేటర్లు లేరు. కనుక ఇంజినీరింగ్ పనుల్లో వసూలు చేసే డబ్బుల్లో తనకు 5 శాతం ఇవ్వాలని మంకుపట్టు పడుతున్నట్లు తెలుస్తోంది. నిన్నా మొన్నటి వరకు నగరంలో జరుగుతున్న ఇంజినీరింగ్ పనుల్లో 7 శాతం కమీషన్ వసూలు చేసేవారని సమాచారం. ఇప్పుడు దాన్ని 10 శాతానికి పెంచి అందులో 5 శాతం వాటా ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.
తాము అధికారంలోకి వస్తే చెత్త పన్ను రద్దు చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిన తరువాత పన్నులను యథాతధంగా వసూలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. నగరంలో సుమారు 50కి పైగా బడా ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి. అందులోంచి వచ్చే బయో వేస్టేజీని తీసుకెళ్లేందుకుగాను ఒక్కో ఆస్పత్రి నుంచి నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. అలాగే నగరంలో ప్రధానంగా 15 కళ్యాణ మండపాలు, మరో 15కు పైగా షాపింగ్ మాల్స్, 25కు పైగా విద్యా సంస్థలు ఉన్నాయి. వీటి నుంచి కూడా చెత్త సేకరించడానికి ప్రతినెలా రూ.10 వేల నుంచి రూ.20 వేలు వసూలు చేస్తున్నారు. ఇక నివాస గృహాల నుంచి చెత్త పన్నులు వసూలు చేసేందుకు కర్నూలు నుంచి ప్రత్యేకంగా కొందరిని పిలిపించినట్లు తెలుస్తోంది. చెత్త సేకరణ పేరుతో వీధుల్లో తిరుగుతూ ఇంటికి రూ.50 నుంచి రూ.70 వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఎవరైతే డబ్బులు ఇవ్వరో ఆయా వీధుల్లో చెత్త సేకరణకు వెళ్లడానికి ఆసక్తి చూపడంలేదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో చెత్త పన్నుల ద్వారా నెలకు రూ.45 లక్షలు సేకరించి నేరుగా పాలక సంస్థ అకౌంట్‌కు జమ చేశారు. అయితే ఇప్పుడు సేకరిస్తున్న చెత్త పన్ను డబ్బులు కీలక అధికారి ఖాతాకు మళ్లుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. గత రెండేళ్లుగా ఈ డబ్బుల లెక్కలు ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఎందుకు ఉంచారో దేవుడికే తెలియాలని మున్సిపల్ ఉద్యోగులు కొందరు చెబుతున్నారు.
మార్కాపురం టౌన్: మార్కాపురం జిల్లాలోని కలెక్టరేట్‌లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎం.విజయసునీత ఆదివారం తెలిపారు. ప్రజల సమస్యలను అర్జీల రూపంలో తీసుకొచ్చి సంబంధిత అధికారులకు అందజేయాలన్నారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ కార్యక్రమం నిర్వహిస్తారని, జిల్లాలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ముండ్లమూరు: మండలంలోని ఉమా మహేశ్వరపురం అగ్రహారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న భోగ సముద్రం భాగ్యశ్రీ, చొప్పరపు హరిప్రియలు జాతీయ స్థాయి షార్ట్ బాల్ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు తిరుపతి స్వామి ఆదివారం తెలిపారు. ఇరువురు బాలికలు గత ఏడాది నవంబర్‌లో కడప జిల్లా పులివెందులలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో తృతీయ స్థానంలో నిలిచారు. దీంతో జాతీయ స్థాయిలో ఢిల్లీలో ఈనెల 16 నుంచి 22 వరకు జరిగే పోటీల్లో ఆడనున్నట్లు వ్యాయామ ఉపాధ్యాయులు తెలిపారు.
ఒంగోలు సిటీ: జిల్లాలోని ఏపీ ఆదర్శ పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశ పరీక్షకు 861 మంది హాజరైనట్లు డీఈఓ సీవీ రేణుక ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్షను ఆరు కేంద్రాల్లో నిర్వహించినట్లు చెప్పారు. ఈ పరీక్షకు 961 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 861 మంది హాజరైనట్లు తెలిపారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సజావుగా నిర్వహించామన్నారు. పరీక్ష ఫలితాల అనంతరం మెరిట్ కం రోస్టర్ విధానంలో విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారని తెలిపారు.


