అశ్వవాహనంపై చెన్నకేశవస్వామి | - | Sakshi
Sakshi News home page

అశ్వవాహనంపై చెన్నకేశవస్వామి

Apr 13 2026 7:20 AM | Updated on Apr 13 2026 7:20 AM

అశ్వవాహనంపై చెన్నకేశవస్వామి నిద్రిస్తున్న మహిళల మెడలో గొలుసు చోరీ వెలిగొండ ప్రాజెక్టు కనిగిరికి వరప్రసాదం ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించాలి

మార్కాపురం టౌన్‌: శ్రీదేవి, భూదేవి సమేత శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి అశ్వవాహనంపై రంగనాయకస్వామి అలంకారంలో చెన్నకేశవ స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు శ్రీపతి అప్పనాచార్యులు, అర్చక బృందం ప్రత్యేక పూజలు చేశారు. చెన్నకేశవస్వామి వారు పుష్పాలంకారాలతో, విద్యుద్దీపకాంతుల మధ్య అశ్వవాహనంపై స్వామికి ఊరేగింపు చేశారు. భక్తులు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉభయదాతలుగా జటప్రోలు దక్షణామూర్తి శర్మ వ్యవహరించగా, ఆలయ ఈఓ జి.శ్రీనివాసరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు, ఉభయదాతలు పాల్గొన్నారు.

ముండ్లమూరు: నిద్రిస్తున్న మహిళ మెడలో మూడు సవర్ల బంగారు గొలుసును దుండుగలు లాక్కోని వెళ్లారు. ఈ సంఘటన మండలంలోని పోలవరంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన మూతికేయపల్లి శ్రావణి తమ ఇంటి ముందు నిద్రిస్తుండగా ఆదివారం తెల్లవారుజామున ఇద్దరు గుర్తుతెలియని దుండగులు ఆమె మెడలోని మూడు సవర్ల బంగారు గొలుసు లాక్కొని పరారయ్యారు. శ్రావణి వెంటనే కేకలు వేసినా అప్పటికే దుండగలు పరారయ్యారు.

కనిగిరిరూరల్‌: వెలిగొండ ప్రాజెక్టు ఒక్కటే కనిగిరి ప్రాంతానికి వరప్రసాదమని, పశ్చిమ ప్రాంత అభివృద్ధి, తాగు, సాగునీటి సమస్యల పరిష్కారానికి వెలిగొండ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాల్సిన ఆవశ్యకత ఉందని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, పూర్వపు ఉమ్మడి ప్రకాశం జిల్లా కలెక్టర్‌, హిందూ ధార్మిక పరిషత్‌ చైర్మన్‌ దాసరి శ్రీనివాసులు అన్నారు. ఆదివారం ఆయన భైరవకోన, మాలకొండ దేవాలయాలను సందర్శించిన అనంతరం కనిగిరిలోని మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డి నివాసంలో విలేకర్లతో మాట్లాడారు. తాను జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు వెనుకబడిన కనిగిరి ప్రాంతం అభివృద్ధిలో భాగంగా ప్రతి వారం పర్యటించానని, ఈ ప్రాంతాన్ని హరిత వనంగా మార్చేందుకు ఎంతో కృషి చేసినట్లు వెల్లడించారు. వెలిగొండ ప్రాజెక్టు, ఉదయగిరి ఇరిగేషన్‌ ట్యాంక్‌ల అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతంలో తాగు, సాగు నీటి సమస్య శాశ్వత పరిష్కారమవుతుందన్నారు. గతంలోనే తాను అప్పటి ప్రజాప్రతినిధులతో కలిసి.. ఉన్నత ఆలోచనాత్మక ప్రణాళికల నివేదికలు రూపొందించి ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చామని, తత్ఫలితంగానే నేడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు రూపుదాల్చుతున్నట్లు వివరించారు. ధార్మికంగా అభివృద్ధిలో భాగంగా కనిగిరి భైరవకోన– మాలకొండ దేవాలయాలను ఏకీకరణ చేస్తూ ప్రత్యేక ప్రణాళిక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. హిందూ ధర్మ పరిక్షణ సమితి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఆదరణకు నోచుకోని సుమారు 200 పైగా దేవాలయాలను కనిగిరి, కందుకూరు డివిజన్‌లలో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే ఆలయాల్లో సామూహిక వివాహాలు జరిపించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ శివ రామిరెడ్డి తదితరులున్నారు.

మార్కాపురం: ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని వెంటనే ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్‌ చేసింది. మార్కాపురం జిల్లాలో పనులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఉపాధి హామీ పనులను వెంటనే ప్రారంభించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘ మార్కాపురం జిల్లా కమిటీ కార్యదర్శి జీ బాలనాగయ్య ప్రభుత్వాన్ని ఆదివారం డిమాండ్‌ చేశారు. వెనుకబడిన మార్కాపురం జిల్లాలో పనులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ వలసలు వెళ్లాల్సిన పరిస్ధితి ఏర్పడిందన్నారు. ప్రజాసంఘాల కార్యాలయంలో కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం కే మాల్యాద్రి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాత పద్ధతిలోనే ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని, వలసలు నివారించాలని, ఉపాధి హామీ కూలీలకు భద్రత కల్పించాలని, కరువు సహాయక చర్యలను వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పనులు లేక సుదూర ప్రాంతాలకు వలస వెళ్లే సమయంలో ప్రమాదాల బారినపడి చనిపోతున్నారని, వ్యవసాయ కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం రక్షణ కల్పించడంలో విఫలమైందని, వెంటనే రక్షణ చట్టాలను కల్పించి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. తురక ఏడుకొండలు, రాము, రత్నం, కోటమ్మ, రమేష్‌, బీ వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement