మొక్కజొన్న రైతుకు ధరాఘాతం | - | Sakshi
Sakshi News home page

మొక్కజొన్న రైతుకు ధరాఘాతం

Apr 13 2026 7:20 AM | Updated on Apr 13 2026 7:20 AM

మద్దతు ధరకు కొనుగోలు చేసే వారే లేక అప్పుల పాలవుతున్న రైతు జిల్లాలో 50 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు మద్దతు ధర ప్రకటించి ఊరుకున్న ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని వైనం రైతులను దోచుకుంటున్న దళారులు క్వింటాలు ధర రూ.1500 నుంచి రూ.1700లకు కొనుగోలు అద్దంకిలో ఈ నెల 15న ధర్నాకుపిలుపునిచ్చిన వైఎస్సార్‌ సీపీ

మొక్కజొన్న పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని 15న వైఎస్సార్‌ సీపీ ధర్నా అద్దంకి నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ చింతలపూడి అశోక్‌ కుమార్‌

రైతు పరిస్థితి దయనీయం

అద్దంకి: పొగాకు సాగు చేయవద్దు, ప్రత్యామ్నాయంగా శనగ, మొక్కజొన్న సాగు చేయమని చెప్పిన వ్యవసాయాధికారులు ప్రభుత్వం చెప్పిన మాటలు విని మొక్కజొన్న సాగు చేసిన రైతులను పట్టించుకునే వారే కరువయ్యారు. ఆటుపోట్లను తట్టుకుని పండించిన మొక్కజొన్నలకు గిట్టుబాటు ధర లేక రైతు విలవిల్లాడుతున్నాడు. నిల్వ చేసుకునే పంట కాకపోవడంతో దళారి అడిగిన కాడికి విక్రయించాల్సిన పరిస్థితి దాపురించింది. దాంతో పెట్టుబడులు కూడా రాక, అప్పుల పాలవుతున్నాడు. పట్టించుకోవాల్సిన ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి తమపని అయిపోయిందన్నట్లు ఊరుకుంది. జిల్లాలో ఎక్కడా కొనుగోలు కేంద్రాలే ఏర్పాటు చేయకపోవడంతో రైతులు దళారులు చెప్పిన ధర రూ.1500 నుంచి రూ.1700లకే విక్రయించి నష్టపోవాల్సిన పరిస్థితి కలుగుతోంది. ప్రభుత్వమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో ఈనెల 15వ తేదీన అద్దంకిలో భారీ ధర్నా నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ చింతలపూడి అశోక్‌ కుమార్‌ తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో మొక్కజొన్నకు క్వింటాలు రూ.2400 మద్దతు ధర ప్రకటించి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో చేయూతనిచ్చింది. దళారులు సైతం అంతకన్నా ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేయడంతో రైతులు లాభాలు గడించారు.

మద్దతు ధరతో సరి... కేంద్రాలు ఏవి?

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సుమారు 50 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటను రైతులు సాగు చేశారు. అద్దంకి నియోజకవర్గంలో అత్యధికంగా 30 వేల ఎకరాలకు పైగా మొక్కజొన్నను సాగు చేశారు. ఎకరాకు రూ.20 నుంచి రూ.25 వేల వరకు కౌలు, విత్తనాలు వ్యవసాయం, దున్నకాలు, ఎరువులు, పురుగుమందులతో కలుపుకుని ఎకరాకు రూ.60 నుంచి రూ.65 వేల వరకు పెట్టుబడి పెట్టారు. ఆశించిన దిగుబడులు రాక ఎకరాకు సరాసరిన 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చిందని రైతులు చెబుతున్నారు.

ఎకరాకు రూ.20 వేల నష్టం

ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేస్తే రూ.60 వేల నుంచి రూ.65 వేల వరకు వచ్చి పెట్టుబడులు దక్కేవి. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు క్వింటాకు రూ.1500 నుంచి రూ.1700లకే కొనుగోలు చేస్తున్నారు. రైతుకు ఎకారకు రూ.37 వేల నుంచి రూ.42 వేలు మాత్రమే దక్కుతుంది. దాంతో ఎకరాకు పెట్టుబడి రూ.60 వేల నుంచి రూ.65 వేలు కావడంతో ఎకరాకు రూ.20 వేల వరకు నష్టపోవాల్సి వస్తోంది.

మంత్రి మాటలతో రైతుల్లో ఆగ్రహం..

జే పంగులూరు మండలం కొండమూరు పర్యటనకు వచ్చిన విద్యుత్‌ శాఖ మంత్రి రవికుమార్‌ మొక్కజొన్న రైతుల ఆవేదన వినాల్సింది పోయి, వారిని విసుక్కోవడంతో రైతులు మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలోనే మద్దతు ధర అమలైందని, కొనుగోలు కేంద్రాలతో రైతులను ఆదుకుందని, ఈ ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి చేతులు దులుపుకుందని విమర్శిస్తున్నారు.

అద్దంకి: రైతుల పరిస్థితి నేడు దయనీయంగా మారిందని వైఎస్సార్‌ సీపీ అద్దంకి నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ చింతలపూడి అశోక్‌ కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్‌ శాఖ మంత్రిని కొండమూరులో మొక్కజొన్న రైతులు కలసిన సందర్భంగా ఆయన రైతులను విసుక్కోవడంపై మండిపడ్డారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారంి నియోజకవర్గంలోని పంగులూరు మండలం కొండమూరు గ్రామంలో పర్యటించిన మంత్రి గొట్టిపాటి రవిని కలిసి, తాము పండించిన మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు విన్నవించుకున్నారు. సమస్యను పరిష్కరించాల్సింది పోయి రైతులపై మంత్రి కోప్పడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కష్టాల్లో ఉన్న రైతుకు అండగా ఉండాల్సింది పోయి, ఇలాంటి వైఖరి ప్రదర్శించడం ఎంతవరకు సమంజసమని డాక్టర్‌ అశోక్‌ కుమార్‌ ప్రశ్నించారు. మొక్కజొన్న పండించిన రైతులు దళారుల చేతిలో మోసపోకుండా, ప్రభుత్వం తక్షణమే కనీస మద్దతు ధరతో పంటను కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 15వ తేదీన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాకు పిలుపునిచ్చారు. పండించిన పంటను అమ్ముకోలేక కుదేలవుతున్న అన్నదాతకు సంఘీభావంగా వైఎస్సార్‌ సీపీ ఈ ధర్నా చేపడుతోందని శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కార్యక్రమంలో వివిధ రైతు సంఘాల నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ కలిసి వచ్చి ఈ పోరాటాన్ని జయప్రదం చేసి, ప్రభుత్వ మెడలు వంచి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement