కార్మికుల భద్రత గాలిలో దీపమే..! | - | Sakshi
Sakshi News home page

కార్మికుల భద్రత గాలిలో దీపమే..!

Apr 13 2026 7:20 AM | Updated on Apr 13 2026 7:20 AM

బల్లికురవ:

గ్రానైట్‌ క్వారీల్లో తరుచూ ప్రమాదాలు సంభవిస్తూ కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అయినా పట్టించుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో తూతూమంత్రంగా తనిఖీలు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితంగా ఎక్కడో దూర ప్రాంతాల నుంచి పొట్టకూటి కోసం వచ్చి అమాయక కూలీల బతుకులు బండల కింద తెల్లవారుతున్నాయి. ప్రమాదం సంభంవించినప్పుడు అయ్యో పాపం అంటున్న అధికారులు మామూళ్ల మత్తుతో ఆ తదుపరి క్వారీల వైపు కన్నెత్తి చూడటం లేదన్న ఆరోపణలలు ఉన్నాయి.

అటకెక్కిన భద్రతా చర్యలు..

జిల్లాలోని చీమకుర్తి, బల్లికురవ, సంతమాగులూరు మండలంలోని గురిజేపల్లిలో సుమారు 140 పై చిలుకు క్వారీలున్నాయి. ఈ క్వారీలకు సంబంధించి ఇప్పటి నెల్లూరులో ఉన్న డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ మైన్స్‌ అండ్‌ సేఫ్టీ కార్యాలయాన్ని ఇటీవల హైదరాబాద్‌కు తరలించారు. దీంతో క్వారీల్లో నిబంధనలు, భద్రతా చర్యలు అటకెక్కాయి. క్వారీలో సెకండ్‌ క్లాస్‌ మేనేజర్ల స్థానంలో బినామీలు పెత్తనం చెలాయిస్తున్నారు. మైన్స్‌ మేనేజర్లు సేఫ్టీ యంత్రాంగం పనులు జరిగే సమాయాల్లో క్వారీల్లో కనిపించరు.

క్వారీల్లో వరుస ప్రమాదాలు..

గత ఏడాది ఆగస్టు 3న బల్లికురవ సమీపంలోని ఈర్లకొండ సత్యకృష్ణ క్వారీలో కార్మికులు జాకీలతో రాయిని డ్రిల్లింగ్‌ చేస్తుండగా ఎగువ నుంచి 10 టన్నులకు పైబడిన రాయి కార్మికులపై పడటంతో అక్కడిక్కడే ఆరుగురు మృతి చెందగా వైద్యశాలలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతి చెందారు. క్వారీలో ప్రమాదం ఉదయం సుమారు 10 గంటలకు జరిగితే మధ్యాహ్నం 3 గంటలకు మీడియా ప్రతినిధులను సైతం క్వారీలోకి రాకుండా అడ్డుకున్నారు. ఈ ఘటన మరువక ముందే వారానికి బల్లికురవకు సమీపంలోని సనకొండ కంకర క్వారీలో మరో ఒడిస్సా కార్మికుడు సాధురామ్‌ కశ్యప్‌ (32) ఎగువ నుంచి రాళ్లు పడి చనిపోయాడు. ఇక్కడ పనిచేసే కార్మికులకు ఆదివారాలు, పండగలు సెలవు దినాలు ఉండవు. రాత్రిళ్లు పనులు చేయిస్తుంటారు. క్వారీల్లో దుమ్ము లేవకుండా ప్రతి రోజూ క్వారీతో పాటు సమీపంలో ఉన్న రోడ్డుపై నీళ్లు చల్లించాలి. ఫస్టు ఎయిడ్‌ కిట్లు అందుబాటులో ఉండాలి. కానీ ఇవేవి క్వారీ నిర్వాహకులకు పట్టవు..

కనిపించని బెంచ్‌ కటింగ్‌ నిబంధన..

బెంచ్‌కటింగ్‌ నిబంధనలు ఏ క్వారీలోనూ కనిపించవు. నిబంధన ప్రకారం పై నుంచి క్వారీని తొలిచే క్రమంలో ఒక్కో వరుసలో ఏడు మీటర్లు వెడల్పు వదిలి పనులు చేపట్టాలి. అలా చేస్తే రాయిని కోల్పోవాల్సి వస్తుంది. ఈ నిబంధన పాటించకపోవటం వల్లే సత్యకృష్ణ క్వారీలో ప్రమాదం సంభవించి 9 మంది చనిపోయారు. భద్రతా వారోత్సవాల్లోనూ ఈ మూడు మండలాల్లోని క్వారీల్లో పనిచేసే టీంలుగా నియమించుకోవటంతో అంతా బాగున్నట్లుగానే కితాబు ఇస్తున్నారు. సేప్టీ కార్యాలయం ఆంధ్రాకు అందుబాటుకు ఒంగోలులో ఏర్పాటుతో తనిఖీలు చేపడితే ప్రమాదాలకు చెక్‌ పెట్టవచ్చని ప్రజా సంఘాల డిమాండ్‌ చేస్తున్నాయి.

క్వారీలో ఎగువన దిగువ ఒకేసారి పనులు

బల్లికుర ఈర్లకొండ క్వారీ

గ్రానైట్‌ క్వారీల్లో తరుచూ ప్రమాదాలు

వలస కూలీలకు కరువైన భద్రత

క్వారీలు ఆంధ్రాలో..సేఫ్టీ కార్యాలయం తెలంగాణలో..

తూతూమంత్రంగా తనిఖీలు

ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోని అధికారులు

క్వారీలో నిబంధనలు పాటించరు

గ్రానైట్‌, మెటల్‌ క్వారీల్లో నిబంధనలతో పాటు భద్రతా చర్యలు కచ్చితంగా పాటిస్తే ప్రమాదాలకు చెక్‌పెట్టవచ్చు. పనులు చేసేటప్పుడు క్వారీలో మేనేజర్లు అందుబాటులో లేకుండా బినామీలతో పనులు చేయించటంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తుయి. పొట్ట చేతపట్టుకుని పరాయి రాష్ట్రాల నుంచి వలసలు వస్తున్న కార్మికులను ఆదరిస్తూ మైనింగ్‌తో పాటు రెవెన్యూ, పోలీస్‌ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలి. మైనింగ్‌తో పాటు రెవెన్యూ, పోలీస్‌ అధికార్లు ఎప్పటికప్పుడు తనిఖీలతో కార్మికుల వివరాలు నమోదు చేసుకోవాలి. అప్పుడే కొంతమేర ప్రమాదాలకు చెక్‌పెట్టవచ్చు. – తంగిరాల వెంకటేశ్వర్లు, సీఐటీయూ నాయకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement