అవమానపరచడంలో మంత్రి స్వామిది ప్రధాన పాత్ర దౌర్జన్యంగా విగ్రహావిష్కరణ దారుణమన్న మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ విగ్రహాలపై పసుపునీళ్లు చల్లి క్షీరాభిషేకం
మర్రిపూడి: దళితుల ఐక్యతను చెడకొట్టి వారిని పావులుగా వాడుకునేందుకు, దళిత నేతల విగ్రహాలు దౌర్జన్యంగా ఆవిష్కరించడానికి కూటమి నేతలు పూనుకున్నారని, మహా దళిత నేతలను అవమానించారని పీఏసీ సభ్యుడు, కొండపి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ ఆదిమూలపు ధ్వజమెత్తారు. మండల కేంద్రమైన మర్రిపూడి ప్రభుత్వ కార్యాలయ సముదాయంలో ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్‌రాం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలపై ఆదివారం రాత్రి పసుపునీళ్లు చల్లి, క్షీరాభిషేకం చేసి, పూలమాలలు వేసి సురేష్ నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఏడాది వైఎస్సార్ సీపీ మండల గ్రీవెన్స్‌సెల్ అధ్యక్షుడు గురిజాల యోబు, విగ్రహాల ఆవిష్కరణ కమిటీ ఉపాధ్యక్షుడు కొమ్ము యోహోనుల ఆధ్వర్యంలో దాతల సహకారంతో విగ్రహాలు ఏర్పాటు చేయగా ఈ నెల 5న టీడీపీ కార్యకర్తలు ఆ విగ్రహాలు ఆవిష్కరించాలని ప్రయత్నించారన్నారు. నాటకీయంగా ప్రభుత్వ ఉత్తర్వులు అంటూ స్థానిక మంత్రి స్వామి ఆదేశాలతో పోలీసు బలగాల మధ్య తహశీల్దార్ జనార్దన్ చేత ఉద్రిక్త వాతావరణంలో విగ్రహాలను ఆవిష్కరించారన్నారు. ఇది దళితజాతికే అవమానకరమన్నారు. కూటమి నేతలు, కార్యకర్తలు ఒక్క రూపాయి కూడా డబ్బులు ఇవ్వకుండా అధికారాన్ని, పోలీసులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యంగా విగ్రహాలను ఆవిష్కరించడం దారుణమన్నారు. ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అందుకే ఆ మైలను కడిగేసేందుకే పసుపునీళ్లు చల్లి క్షీరాభిషేకం చేశామన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా విగ్రహాలను ఆవిష్కరిస్తే ఎక్కడ వైఎస్సార్ సీపీకి పేరు వస్తుందోనని కడుపు మంటతో మంత్రి స్వామి కుట్రపూరితమైన చర్యలకు పాల్పడ్డారని మండిపడ్డారు. దళితుల మధ్య చిచ్చుపెట్టడం, పోలీసు కేసులు పెట్టడం, దౌర్జన్యాలు చేయడం కూటమి ప్రభుత్వం నైజంగా మారిందని ధ్వజమెత్తారు. మహానేతల విగ్రహాలు ఈ విధంగా ఆవిష్కరిస్తారా? మహా నేతలను అవమానపరుస్తారా? ఒక దళితుడివై ఇలా ప్రవర్తించడానికి సిగ్గుగా లేదా అని మంత్రి స్వామిని నిలదీశారు. మీటింగ్‌లకు కనీసం మైకు పెట్టుకోనివ్వరు. కుర్చీలు వేసుకోనివ్వరు, కేసులు పెట్టండి ఎంతమందిపై పెడతారో చూస్తాం జైళ్లు కూడా సరిపోవు అని అన్నారు. రాబోవు రోజుల్లో కొండపి నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేసి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకుంటామన్నారు. ఎవరూ అధైర్యపడవద్దన్నారు, మంచి రోజులు వస్తాయన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఇనుకొల్లు సుబ్బారెడ్డి, మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు గురిజాల యోబు, గురిజాల రమేష్ (చిన్నారి), కొమ్ము యహోను, పొన్నలూరు జెడ్పీటీసీ సభ్యుడు, మండల పరిశీలకుడు బెజవాడ వెంకటేశ్వరరెడ్డి, చితంపల్లి హరిబాబు, కోండ్రు ఇజ్రాయిల్, కొమ్ము ప్రభుదాస్, గండి జోసెఫ్, ఒనుకూరి పవన్‌కుమార్, ఓ రవి, దాసరి సాల్మన్, కోండ్రు సాల్మన్, దాసరి ఇమ్మానియేలు, బోద రమణారెడ్డి, మాకినేని వెంకట్రావు, బత్తల కోటేశ్వరరావు, ఓబులేసు, లోకయ్య, గడ్డం బాలాజీ, మర్రి కిరణ్‌కుమార్,గురిజాల బెంజ్‌మన్, దుడ్డు రాములు పాల్గొన్నారు.


