కట్టకిందపల్లిలో కలకలం
కనిగిరిరూరల్: అదో మారుమూల గ్రామం. చీమ చిటుక్కుమన్నా గ్రామస్తులందరికీ క్షణాల్లో సమాచారం తెలుస్తోంది. ఒకే ఇంట్లో రెండు నిర్జీవంగా పడి ఉండటంతో వెలిగండ్ల మండలం కట్టకిందపల్లిలో ఒక్కసారిగా కలకలం రేగింది.
ఉలిక్కిపడిన గ్రామస్తులు
వివాహిత మహిళ బండ్లముడి నాగలక్ష్మి(33) రక్తపు మడుగులో పడి ఉండటం, ఆ ఇంట్లోనే పోలీస్ ఉద్యోగి.. పురుగుల మందు తాగి నురుగులు కక్కుతూ పడిఉండడంతో చూసిన గ్రామస్తులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కొన్నేళ్ల నుంచి నాగలక్ష్మి సేనావలి పొలంలో కూలి పనులకు వెళుతుంది. నాగలక్ష్మితో కలిసి మరికొందరు కూలి పనులకు వెళ్లారు. అయితే నాగలక్ష్మి సేనావలి అద్దెకు తీసుకుని నివసిస్తున్న ఇంట్లో నిర్జీవులుగా కన్పించడంలో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు.
బయటపడింది ఇలా..
ఘటన జరిగిన ఇంటికి వెనుక వైపు కొద్ది దూరంలోనే సేనావలి కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న పొలాలు ఉన్నాయి. పొగాకు తోటకు నీళ్లు కట్టేందుకు రావాల్సిన నాగలక్ష్మి మధ్యాహ్నం దాటినా రాలేదు. దీంతో ఇంటి దగ్గరికి వెళ్లి గమనించగా.. ఇద్దరు విగతజీవులుగా పడిఉన్నారు. విషయాన్ని గ్రామస్తులకు తెలిపారు. దీంతో పోలీసులకు సమాచారం అందింది.
అసలేం జరిగింది.. ?
ఘటన స్థలాన్ని బట్టి చూస్తే ఇద్దరి మధ్య చాలా సేపు పెనుగులాట, గొడవ జరిగినట్లు ఘటనా స్థలిని చూస్తే తెలుస్తోంది. సేనావలి నాగలక్ష్మిని గోడకేసి గట్టిగా కొట్టడం వల్లే తలకు బలమైన గాయమై మృతి చెంది నట్లు భావిస్తున్నారు. గొడవలో నాగలక్ష్మి చనిపోయిన తర్వాత సేనావలి భయంతో పురుగుమందు తాగి ఆపస్మారక స్థితికి చేరాడు. అయితే వివాహిత నాగలక్ష్మిని హత్యచేసి భయంతో పురుగుల మందు తాగినట్లు నటిస్తున్నాడని.. స్థానికులు భావించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరారు. వారిద్దరి అస్పత్రికి తరలించే ప్రయత్నాన్ని కొద్దిసేపు అడ్డుకున్నారు. డీఎస్పీ రంగ ప్రవేశంతో వారిద్దరిని కనిగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సేనావలి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సేనావలి స్వగ్రామం అద్దంకిగా తెలుస్తోంది. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. అయితే వారిద్దరి మధ్య ఎందుకు గొడవ జరిగిందన్నది విచారణలో తేలాల్సి ఉంది.
నా భార్యను అన్యాయంగా చంపాడు
నా భార్య నాగలక్ష్మిని పొలం పనికి అని పిలిచి అన్యాయంగా చంపాడని నాగలక్ష్మి భర్త నెమలయ్య వాపోయాడు. కేవలం దురుద్దేశంతోనే అన్యాయంగా హత్య చేశాడని కన్నీరుమున్నీరుగా విలపించాడు.
విచారణలో విషయాలన్నీ తెలుస్తాయి:
సీఐ శ్రీనివాసరావు
కట్టకిందపల్లిలో ఇద్దరు మృతిపై సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ విచారణలో అన్నీ విషయాలు తెలుస్తాయని చెప్పారు. కట్టకింద పల్లి గ్రామంలో సేనావలి అద్దెకు తీసుకున్న ఇంట్లో ఇద్దరు పడిపోయి ఉన్నారని, నాగలక్ష్మి మృతి చెందగా, సేనావలిని కనిగిరి ప్రభుత్వ ఆస్పత్రికి 6.30 గంటలకు తీసుకురాగా చికిత్స పొందుతూ 7 గంటలకు మృతి చెందాడని తెలిపారు. దీనిపై ఫిర్యాదు తీసుకుని హత్య కేసు నమోదు చేశామని చెప్పారు. సేనావలి పోలీస్ శాఖలో పనిచేస్తాడని తెలిసిందని, అన్ని కోణాల్లో విచారిస్తున్నామని, విచారణ అనంతరం అన్ని వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.
ఇద్దరు మృతితో ఉలిక్కిపడిన గ్రామం
అసలేం జరిగిందని గ్రామమంతా చర్చ
అన్ని కోణాల్లో పోలీసుల దర్యాప్తు


