మూల్యం తప్పదు
కూటమి నేతల వైఖరికి
నాగులుప్పలపాడు: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వారి కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రదర్శిస్తున్న అహంకార పూరిత విధానాలకు తగిన మూల్యం చెల్లించక తప్పదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు. నాగులుప్పలపాడు మండలం మాచవరంలో జనసేన నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి ఒంగోలు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఉప సర్పంచ్ ఉలిచి నాగేశ్వరరావును మంగళవారం పరామర్శించారు. అనంతరం మాజీ మంత్రి, సంతనూతలపాడు ఇన్‌చార్జి మేరుగు నాగార్జున మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తల మనోధైర్యం దెబ్బతీయాలనే కుట్రతో చేస్తున్న ఇలాంటి దాడులడు ఏమాత్రం భయపడమన్నారు. ఇలాంటి హేయమైన దాడులకు భవిష్యత్‌లో పెద్ద మూల్యం చెల్లించక తప్పదన్నారు. ఈ సందర్భంగా ఉలిచి నాగేశ్వరరావుకు ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పరామర్శించిన వారిలో ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మనందరెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఇనగంటి పిచ్చిరెడ్డి, ఎంపీపీ నలమలపు అంజమ్మ కృష్ణారెడ్డి, పాలడుగు రాజీవ్, చీమకుర్తి జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, మాచవరం సర్పంచ్ ఇనగంటి రమణారెడ్డి ఉన్నారు.


