జిల్లాకు తలమానికంగా రామాయపట్నం పోర్టు
గుడ్లూరు: జిల్లాకు తలమానికంగా మారనున్న రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులు 80 శాతం పూర్తయ్యాయని కలెక్టర్ పీ రాజాబాబు అన్నారు. బుధవారం ఆయన రామాయపట్నం పోర్టును సందర్శించారు. పోర్టు నిర్మాణ పనులు, భూసేకరణపై కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీతో కలిసి సమీక్షించారు. ఆయా పనుల్లో పురోగతిని అధికారులు, పోర్టు సంస్థ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్‌కు వివరించారు. పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం సముద్రంలోకి వెళ్లి బెర్తుల పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల జరిగిన జిల్లాల పునర్విభజనలో భాగంగా కందుకూరు డివిజన్‌లోని గుడ్లూరు, ఉలవపాడు, లింగసముద్రం, వలేటివారిపాలెం, కందుకూరు మండలాలను ప్రకాశం జిల్లాలో కలిపారన్నారు. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్న రామాయపట్నం పోర్టు పనుల పురోగతిని పరిశీలించినట్లు చెప్పారు. భూసేకరణ పనులు దాదాపు పూర్తయ్యాయన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి పోర్టు నిర్మాణం పూర్తి చేసే దిశగా పనులు జరుగుతున్నాయన్నారు. అనంతరం తెట్టులో నిర్వాసితులకు నిర్మించిన పునరావాస కాలనీని కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట పోర్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజశేఖర్, నవయుగ కాంట్రాక్టరు కంపెనీ ప్రతినిధి నారాయణ, మారిటైమ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు శివరాం, బీపీసీఎల్ ఇండోసోల్ ప్రతినిధులు, తహశీల్దార్ బాల కిశోర్, ఎంపీడీఓ వై వెంకటేశ్వరరావు, స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.


