మణులొద్దు..మాణిక్యాలొద్దు..మంచినీళ్లు చాలు..!
చీమకుర్తి మండలంలో పగిలిన సాగర్ తాగునీటి పైపులు
20 రోజులుగా 4 మండలాలకు నిలిచిన తాగునీటి సరఫరా
మర్రిపూడి రక్షిత మంచినీటి పథకం.
మర్రిపూడి:
జిల్లాలోని మర్రిపూడి, కనిగిరి, వెలిగండ్ల, పామూరు, సీఎస్‌పురం మండలాల్లో సుమారు 230 గ్రామాలకు దాదాపు 20 రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. సమస్యను గుర్తించి పరిష్కరించడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు విఫలం కావడంతో ఆయా గ్రామాల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. వందలాది గ్రామాలకు తాగునీటిని సరఫరా నిలిచిపోయినా ఒక్క ప్రజాప్రతినిధి దీనిపై స్పందించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. రామతీర్ధం రిజర్వాయర్ నుంచి మర్రిపూడి మండలం వయా కనిగిరి, పామూరు, సీఎస్‌పురం, వెలిగండ్ల మండలాల ప్రజల దాహర్తి తీర్చేందుకు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2008లో రూ. 91 కోట్లు కేటాయించారు. రామతీర్థం రిజర్వాయర్ నుంచి 5 మండలాలకు నీరు సరఫరా చేసేందుకు 600 ఎంఎం జీఆర్‌పీ పైపులైన్ నిర్మించి ప్రతిరోజు 18 లక్షల లీటర్లు నీరు ఫిల్టర్ బెడ్‌ల ద్వార శుద్ధి చేసి ఆయా గ్రామాలకు తాగునీరు అందించారు. అందులో భాగంగా మర్రిపూడి మండలంలోని 32 గ్రామాలకు పైపులైన్ వేసి తాగునీరు సరఫరా చేసేందుకు రూ.5 కోట్లు కేటాయించి గ్రామశివారులో రక్షత మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేసి, గ్రౌండ్ ఫ్లోర్ ట్యాంక్ నిర్మించి అక్కడి నుంచి మిగిలిన మండలాలకు ప్రతిరోజు తరలిస్తారు. అయితే టీడీపీ ప్రభుత్వంలో ప్రజలకు మంచినీటి కష్టాలు మొదలయ్యాయి.
ఇది పరిస్థితి..
చీమకుర్తి మండలంలోని రామతీర్థ జలాశయం నుంచి సాగర్ జలాలు తరలించే పైపులైన్‌లు ఆ మండలంలోని బక్కిరెడ్డిపాలెం నుంచి నిప్పట్లపాడు పరిసరాల్లో సుమారు 5 ప్రాంతాల్లో పగిలిపోయాయి. అయితే పైపులు పగిలిన ప్రాంతంలో రైతులు వరి సాగు చేసి ఉన్నారు. పైపులైన్ మరమ్మతులు చేసేందుకు వెళ్లిన అధికారులతో పంటను కోసే వరకు మరమ్మతులు చేయడానికి వీల్లేదని రైతులు అడ్డు తగిలారు. అయితే గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇదే విధంగా సమస్య ఎదురైతే రైతులతో మాట్లాడి వారికి నష్టపరిహారం చెల్లించి మరమ్మతులు చేసి తాగునీటికి ఇబ్బందులు లేకుండా చేశారు. అయితే టీడీపీ ప్రభుత్వంలో ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఈ తాగునీటి సమస్యనూ పట్టించుకునే వారే కరువయ్యారు. పాలకులు గానీ, అధికారులు గానీ రైతులతో మాట్లాడి వారిని సర్దిచెప్పి మరమ్మతులు చేయాలన్న తపన ఒక్కరిలోనూ లేదు. కొంత మంది అధికారులు అందుబాటులో ఉన్న రక్షిత మంచినీటి పథకాలు, బోర్లు, బావులు, పాడైపోయిన వాటిని హడావుడిగా మరమ్మతులు చేయించి మొక్కుబడిగా నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలకు ఫ్లోరైడ్ నీరే అందుతోంది. వందలాది గ్రామాలకు నీటి సరఫరా లేకపోవడంతో గ్రామాల్లో శుద్ధజలకేంద్రాలు ఊపందుకున్నాయి. అందిన కాడికి దోచుకుంటూ బబుల్‌వాటర్‌ను ప్రజలకు అమ్ముకుంటూ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం నిద్రమత్తువీడి ప్రజల కష్టాలు తీర్చేందుకు పైపులైన్ మరమ్మతులు చేయాలని పలువురు కోరుతున్నారు.
ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా
230 గ్రామాల్లో దాహం కేకలు.
అధికారుల నిర్లక్ష్యం సాక్షిగా 20
రోజులుగా ప్రజల గొంతెండుతోంది. వందలాది గ్రామాల ప్రజలు దాహం కేకలు నేతలకు వినిపించడం లేదు. ప్రజల సమస్యలపై అలివిమాలిన నిర్లక్ష్యం ప్రదర్శించే ప్రజాప్రతినిధులు, అధికారులు మాకే సంబంధం లేనట్లు వ్యవహరిస్తుండటంతో ఇప్పట్లో దాహం కేకలు తీరే మార్గం కనిపించడం లేదు.
సుమారు 230 గ్రామాల్లో దాహం కేకలు
పైపులు పగిలిన ప్రాంతంలో
సాగులో ఉన్న వరి పైరు
20 రోజులుగా నీటి సరఫరా నిలిచినా
పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్న
ప్రజాప్రతినిధులు, అధికారులు
మణులొద్దు..మాణిక్యాలొద్దు..మంచినీళ్లు చాలు..!
మణులొద్దు..మాణిక్యాలొద్దు..మంచినీళ్లు చాలు..!
మణులొద్దు..మాణిక్యాలొద్దు..మంచినీళ్లు చాలు..!


