తప్పుల తడకగా పాస్ పుస్తకాలు
దిక్కుతోచని స్థితిలో రైతులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సర్కారు ఉచిత సలహా
గిద్దలూరు (బేస్తవారిపేట): ఎన్నికల సమయంలో రీసర్వేపై కూటమి నాయకులు విషం కక్కారు. ప్రతి గ్రామంలో మీ భూములు ఎవరో తీసుకుంటారని విష ప్రచారం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో ఇచ్చిన పాస్‌పుస్తకాల్లో తప్పులు సరిదిద్ది రాజముద్ర కలిగిన పట్టాదారు పాస్‌పుస్తకాలు రైతులకు అందజేస్తామని ఊదరగొట్టారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు కావస్తున్నా.. రీ సర్వే ఒక్క గ్రామంలో పూర్తి చేయలేదు. ఇక ఆర్భాటంగా గ్రామ సభలు పెట్టి అందిస్తున్న పాస్‌పుస్తకాల్లో తప్పులు దొర్లడంతో అన్నదాతలు మండిపడుతున్నారు.
అన్నీ తప్పులే..
మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలంలో మొదటి విడతగా దాదాపు 700 పాస్‌పుస్తకాలు వచ్చాయి. ఇందులో త్రిపురాపురానికి 201, తిమ్మాపురానికి 453, నరసింహునిపల్లెకు 46 పాస్‌పుస్తకాలు రాగా వాటిని అందజేస్తున్నారు. అయితే వాటిలో సర్వే నంబర్లు, ఆధార్ నంబర్, మరికొందరికి భూమి విస్తీర్ణంలో వ్యత్యాసాలు రావడంతో రైతులు నిలదీశారు. దీంతో తప్పులుంటే మళ్లీ దరఖాస్తు చేసుకుంటే సరి చేసి ఇస్తామని సర్దిచెప్పి వెనుతిరిగారు.
ఉన్నది 10 సెంట్లు.. పాస్ పుస్తకంలో 20 సెంట్లు
చట్రెడ్డిపల్లె గ్రామానికి చెందిన పాపితోటి ఓబులేసు 3 నెలల కిందట 10 సెంట్ల భూమికి పాస్‌పుస్తకం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశాడు. అయితే 10 సెంట్ల బదులు 20 సెంట్లు రావడమే కాకుండా పాపితోటి ఓబులేసు అని కాకుండా పారుతొట్టి ఓబులేసు అనే పేరు మీద వచ్చింది. ఆధార్ నంబరు కూడా తప్పు రావడంతో రైతు బిక్కముఖం వేశాడు. ఇలా వందల పాస్‌పుస్తకాలు తప్పులు తడకగా రావడంతో రైతులు మళ్లీ దరఖాస్తు చేసుకునే పరిస్థితి నెలకొంది.
తప్పులు వచ్చిన మాట వాస్తవమే
గిద్దలూరు మండలానికి మొదటి విడతగా 700 పాస్‌పుస్తకాలు వచ్చాయి. వాటిని రైతులకు అందజేస్తున్నాం. అయితే చాలా వరకు ఫొటోలు, సర్వే నంబర్లు, భూమి విస్తీర్ణంలో తప్పులు వచ్చిన మాట వాస్తవమే. రైతులు మళ్లీ దరఖాస్తు చేసుకుంటే 15 రోజుల్లో వాటిని సరిచేస్తాం.
– ఆంజనేయరెడ్డి, తహసీల్దార్, గిద్దలూరు.
తప్పుల తడకగా పాస్ పుస్తకాలు


