మీది నాది కంఠశోషే..
నేను నిమిత్త మాత్రుడిని ఎమర్జెన్సీ ల్యాండింగ్ వ్యతిరేక కమిటీతో జాతీయ రహదారి పీడీ అనిల్‌కుమార్‌రెడ్డి
సింగరాయకొండ: ‘‘మీది నాది కంఠశోష మాత్రమే..ఎమర్జెన్సీ ల్యాండింగ్ రన్‌వే తరలింపు ఎయిర్‌ఫోర్స్ అధికారులు ఇచ్చే నివేదికపై ఆధారపడి ఉంటుంది. నేను కేవలం మీ అర్జీని ఉన్నతాధికారులకు చేరుస్తాను. నేను నిమిత్త మాత్రుడిని’’ అని జాతీయ రహదారి ప్రాజెక్టు డైరెక్టర్ వీ అనిల్‌కుమార్‌రెడ్డి ఎమర్జెన్సీ ల్యాండింగ్ వ్యతిరేక కమిటీ జేఏసీ సభ్యులకు వివరించారు. మండల పరిధిలోని జాతీయ రహదారిపై నిర్మించిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ రన్‌వే తరలింపు సాధ్యాసాధ్యాలపై బుధవారం నాలుగు గ్రామాల ప్రజల విజ్ఞప్తిపై జాతీయ రహదారి పీడీ అనిల్‌కుమార్‌రెడ్డి కనుమళ్ల జంక్షన్‌లోని ఎమర్జెన్సీ రన్‌వే ప్రాంతానికి వచ్చి గ్రామస్తులను కలుసుకున్నారు. దీనిపై గ్రామస్తులు మాట్లాడుతూ ఎమర్జెన్సీ ల్యాండింగ్ రన్‌వే ప్రారంభమైతే ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటామన్నారు. రోడ్డుకు ఇరువైపులా పేద, మధ్య తరగతి ప్రజలకు చెందిన సుమారు 400 ఎకరాల భూమి ఉందని, అంతేకాక ఈ ప్రాంత ప్రజలు పశుపోషణపై ఆధారపడుతూ జీవిస్తుంటారని పశువులను ఈ భూముల్లో మేపుకుంటారని కానీ రన్‌వే నిర్మిస్తే తమతో పాటు రోడ్డు దాటడానికి పశువులు కూడా ఇబ్బందులు పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. జనావాసాల మధ్య రన్‌వే నిర్మించటం వలన రాబోయే రోజుల్లో అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఈ ప్రాజెక్టును వేరొక ప్రాంతానికి తరలించారని విజ్ఞప్తి చేశారు. దీనిపై జాతీయ రహదారి పీడీ వీ అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఎమర్జెన్సీ ల్యాండింగ్ నిర్మాణం వలన వరదల సమయంలో సరుకు రవాణాకు, యుద్ద సమయాల్లో అవసరాలకు ఫైటర్‌జెట్ వంటి యుద్ధ విమానాలు ల్యాండ్ అవటానికి ఈ రన్‌వే ఎంతో ఉపయోగమన్నారు. రోడ్డు దాటడానికి వీలుగా అండర్‌పాస్ నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించటానికి మాత్రమే వచ్చానని, అంతేతప్ప రన్‌వే తరలింపు నిర్ణయం తీసుకునే స్థాయి తనది కాదన్నారు. రన్‌వే తరలింపు రాజకీయ నాయకుల చేతుల్లో ఉందన్నారు. వారం రోజుల క్రితం రన్‌వే ప్రాంతాన్ని ఎయిర్‌ఫోర్స్ అధికారులు పరిశీలించి వెళ్లారని, వారు ఇచ్చే నివేదిక ఆధారంగా రన్‌వే నిర్మిస్తారా లేక తరలిస్తారా అనేది ఆధారపడి ఉంటుందని వివరించారు. రన్‌వే నిర్మాణం వలన ప్రజలు పడే ఇబ్బందులను రాతపూర్వకంగా అర్జీ ఇస్తే ఆ అర్జీని పై అధికారులకు పంపుతానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా లారీ యూనియన్ కమిటీ సభ్యులు పెరల్ డిస్టిలరీ నుంచి జీవీఆర్ ఆక్వా కంపెనీ మధ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయని, సర్వీసు రోడ్డు నిర్మించాలని విజ్ఞప్తి చేయటంతో పీడీ అనిల్‌కుమార్‌రెడ్డి సర్వీసు రోడ్డు నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను స్వయంగా పరిశీలించారు. జాతీయ రహదారి కన్సల్టెంట్ సురేష్‌బాబు, ఎమర్జెన్సీ ల్యాండింగ్ వ్యతిరేక జేఏసీ కమిటీ సభ్యులు, సింగరాయకొండ, కలికవాయ, కనుమళ్ల, మూలగుంటపాడు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.


