ఎస్సై వేమనపై చర్యలు తీసుకోవాలి
అవినాష్ కుటుంబానికి న్యాయం చేయాలి సీఎం హామీ ఇచ్చి 15 రోజులైనా ఇంత వరకూ ఏం న్యాయం చేశారు..? నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు
పొదిలి రూరల్: గత నెలలో పొదిలిలో ఆర్యవైశ్య వ్యాపారి అవినాష్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులపై తీవ్రంగా దాడిచేసిన ఎస్సై వేమనపై ఇంత వర కూ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం దారుణమని మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. పొదిలిలో పార్టీ నాయకులతో కలిసి బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. ఈ విషయంలో ముఖ్య మంత్రితోపాటు హోంమంత్రి, జిల్లా మంత్రి జోక్యం చేసుకున్నారని, మీడియాలో వార్తలు వచ్చాయని, 15 రోజులైనా ఆ ఎస్సైపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమని అన్నారు. వీఆర్‌కు పంపితే ఎస్సైపై చర్యలు తీసుకున్నట్లా అని రాంబాబు ప్రశ్నించారు. ఎన్‌టీ రామారావు పార్టీ పెట్టిన కొత్తలో అవినాష్ తండ్రి టీడీపీలో చేరినట్లుగా ఆయనే చెప్పారని, ఆ పార్టీకి చెందిన సానుభూతిపరుడిపై ఎస్సై దుర్మార్గంగా దాడిచేస్తే కనిగిరి, మార్కాపురం ఎమ్మెల్యేలు వెళ్లి పరామర్శించారని, అంతకు మించి ఎస్సైపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. పొదిలి ప్రాంత ఆర్యవైశ్యులందరూ న్యాయం కోసం ధర్నా, బంద్ చేసినప్పటికీ ఆ కుటుంబానికి న్యాయం జరగలేదన్నారు. తాను వెళితే పార్టీ పరంగా భావించి అవినాష్ కుటుంబానికి న్యాయం జరగదని వ్యక్తిగతంగా వెళ్లి పరామర్శించానన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఆర్యవైశ్యులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని అన్నా రాంబాబు గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎక్కువగా ఆర్యవైశ్య ఓట్లున్న మార్కాపురం నియోజకవర్గంలో తనను పిలిచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీచేయిస్తే తనను ఓడగొట్టారని, అయినా బాధపడటంలేదని అన్నారు. ఆర్యవైశ్యులకు అన్యాయం జరిగితే అందరూ స్పందించాలని అన్నా రాంబాబు విజ్ఞప్తి చేశారు. చీటికి మాటికి వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించేవారు ఎస్సై వేమన ఆర్యవైశ్య వ్యాపారిపై దాడిచేస్తే ఎందుకు స్పందించడం లేదని రాంబాబు ప్రశ్నించారు. ఈ సంఘటనకు పార్టీలతో సంబంధం లేకుండా ఆర్యవైశ్యులందరూ పొదిలిలో ఐక్యంగా ఉండి బంద్‌లో పాల్గొన్నారన్నారు. ఇప్పటికైనా అవినాష్ కుటుంబానికి న్యాయం చేయా లని డిమాండ్ చేశారు. పొదిలి కొండను మర్రిపూడిలోనికి తీసుకెళ్లవద్దని ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీయవద్దని తాను మంత్రితోపాటు స్థానిక ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, మస్తాన్‌వలి, శ్రీనివాసులు, సింగారెడ్డి వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.


