రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
ఉలవపాడు: రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు అన్నారు. కందుకూరు పోలీస్ సబ్‌డివిజన్‌ను ప్రకాశం జిల్లాలో విలీనం ప్రక్రియలో భాగంగా మంగళవారం ఉలవపాడు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ పరిశీలించారు. పోలీస్‌స్టేషన్ స్థితిగతులు, సిబ్బంది పనితీరు, కేసుల నమోదు, ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. స్టేషన్ ఆవరణాన్ని, గదులను, రిసెప్షన్ కౌంటర్, స్టేషన్ పరిసరాలు పరిశీలించారు. పట్టుబడిన వాహనాలు, ఇతర రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో లా అండ్ ఆర్డర్, నేర నివారణ వ్యూహాలపై తీసుకుంటున్న చర్యలపై ఆరా తీసి సూచనలు చేశారు. పోలీస్‌స్టేషన్‌లో పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకొని వాటిని త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించారు. మహిళల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళలు, చిన్నారులపై జరిగే ఆకృత్యాలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. చెడు నడత కలిగిన వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్ వాడాలని, రోడ్డు భద్రత నియమాలు పాటించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పండుగలు, ఉత్సవాల సమయంలో అవాంఛనీయ సంఘటలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఆయన వెంట ఎస్‌బీ డీఎస్పీ చిరంజీవి, కందుకూరు డీఎస్పీ హెచ్‌వీ.బాలసుబ్రహ్మణ్యం, సీఐ అన్వర్‌బాషా, ఎస్సై సుబ్బారావు, సిబ్బంది పాల్గొన్నారు.


