నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి
బేస్తవారిపేట: పదో తరగతిలో నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలని సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్ లక్ష్మానాయక్ అన్నారు. స్థానిక సాంఘిక సంక్షేమశాఖ బాలికల వసతి గృహాన్ని మంగళవారం తనిఖీ చేశారు. ప్రభుత్వం రూపొందించిన 100 రోజుల ప్రణాళిక పక్కాగా నిర్వహించాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఏ, బీ గ్రేడ్‌లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని వార్డెన్లకు సూచనలు ఇచ్చారు. మెనూ అమల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులకు కలిసి అల్పాహారం తిన్నారు. మెనూ ప్రకారం భోజనం అందుతుందా, ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారా లేదా అనే వివరాలు విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ గదులు, వంటగది, టాయిలెట్స్‌ను పరిశీలించారు. హాస్టల్ వెల్పేర్ ఆఫీసర్ స్వర్ణలత, సిబ్బంది పాల్గొన్నారు.
పొన్నలూరు: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మండలంలోని కె.అగ్రహారం గ్రామంలో చౌతన్ ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఈ నెల 10 నుంచి జిల్లాస్థాయి సీటీపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు రావినూతల సునీల్, షేక్ షరీఫ్ తెలిపారు. పోటీల్లో పాల్గొనదలచిన జట్లు రూ.700 ఎంట్రీ ఫీజు చెల్లించి 8వ తేదీ లోగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. గెలుపొందిన జట్లకు మొదటి బహుమతి రూ.50,116, రెండో బహుమతి రూ.25,116 అందజేస్తామన్నారు. వివరాలకు 9959596461, 8520085670 నంబర్లను సంప్రదించాలని కోరారు.
అద్దంకి రూరల్: భవనం పరంజాలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు జారి కిందపడి కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం అద్దంకిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కలవకూరు గ్రామానికి చెందిన తాళ్లూరి మహేష్ (26) భవననిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మంగళవారం అద్దంకి గరటయ్య కాలనీలోని ఓ భవనం ఎక్కి పనిచేస్తుండగా జారి కిందపడి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఒంగోలు జీజీహెచ్‌కు తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఒంగోలు వన్‌టౌన్: ప్రకాశం జిల్లాను రహదారి ప్రమాద రహితంగా చేయడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ పిలుపునిచ్చారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఒంగోలులోని ప్రకాశం భవనం నుంచి మినీ స్టేడియం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. శిక్షణతో భద్రత–సాంకేతికతతో పరివర్తన అనే ఇతివృత్తంతో రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేలా నెల రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి నివారణకు చర్యలు చేపట్టామన్నారు. ర్యాలీలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు, నగర మేయర్ గంగాడ సుజాత, డీటీసీ ఆర్.సుశీల, ఆర్‌అండ్‌బీ ఈఈ గోపీ నాయక్, ఒంగోలు నగర కమిషనర్ వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు, పెద్ద సంఖ్యలో వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.


