మేం చెప్పింది చేయకుంటే బదిలీనే..!
కురిచేడు: పచ్చనేతల అక్రమాలకు ఒత్తాసు పలకలేదని పంచాయతీ కార్యదర్శిని అన్యాయంగా బదిలీ చేయించారు. ఈ సంఘటన మండలంలోని బయ్యవరంలో జరిగింది. వివరాల్లోకి వెళితే..మండలంలోని బయ్యవరంలోని చేపల చెరువును మూడేళ్లకు రూ.13,70,000లకు కురిచేడు సొసైటీ వారు లీజుకు తీసుకున్నారు. దానికి సంబంధించి మొదటి సంవత్సరం లీజు చెల్లించారు. రెండో ఏడాది జూన్ 2025 నాటికి రూ.4,60,000 మొత్తాన్ని పంచాయతీకి చెల్లించాల్సి ఉండగా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ఈ క్రమంలో గత ఏడాది జూన్, జూలై నెలల్లో చేపల చెరువులోని చేపలను మొత్తం అమ్ముకొని సొమ్ము చేసుకొని పంచాయతీకి ఏం చెల్లించలేదు. సెప్టెంబర్ నెల ఆఖరులో కురిసిన మోంథా తుఫాన్‌ను సాకుగా చూపి చేపలు కొట్టుకుపోయాయని కలెక్టర్‌కు అర్జీ పెట్టుకున్నారు. దీంతో కలెక్టర్ విచారణ చేసి నివేదిక ఇవ్వాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. జిల్లా పంచాయతీ అధికారి కనిగిరి డివిజన్ డెవలప్‌మెంట్ అధికారి కె.శ్రీనివాసరెడ్డిని విచారణాధికారిగా నియమించారు. ఆయన గత నెలలో బయ్యవరం చేపల చెరువులు పరిశీలించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శితో పాటు స్థానికంగా విచారించి ఎటువంటి నష్టం జరగలేదని డీపీఓకు నివేదిక పంపించారు. అయితే ప్రకృతి వైపరీత్యాలు, ఇతర కారణాలతో చేపలకు నష్టం వాటిల్లినా పంచాయతీకి ఎటువంటి సంబంధం లేదని, కాంట్రాక్టరే భరించాల్సి ఉందని అగ్రిమెంట్‌లో నిబంధన ఉంది. కానీ సదరు కాంట్రాక్టర్ వాటిని అతిక్రమించి తమకు అనుకూలంగా నివేదిక ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శిపై ఒత్తిడి తెచ్చాడు. మాకు అనుకూలంగా నివేదిక ఇవ్వకుండా అలవలపాడు పంచాయతీ బదిలీ చేయిస్తామని బెదిరించారు. అయితే దీనికి పంచాయతీ కార్యదర్శి అంగీకరించకపోవడంతో కార్యదర్శిని మంగళవారం అలవలపాడు పంచాయతీకి బదిలీ చేశారు. అయితే పంచాయతీకి నష్టం వాటిల్లికుండా చూసిన కార్యదర్శిని అక్రమంగా బదిలీ చేయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి గ్రామ పంచాయతీకి రావాల్సిన బకాయిలు రాబట్టి గ్రామాభివృద్ధికి దోహదపడేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అధికారులపై పచ్చనేతల దౌర్జన్యం
తుఫాన్‌కు నష్టం వాటిల్లిందని నివేదిక ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శిపై ఒత్తిడి
నష్టం వాటిల్లలేదని నివేదిక ఇవ్వడంతో పంచాయతీ కార్యదర్శి బదిలీ


