వంద పడకల ఆస్పత్రి కడితే సెల్యూట్ చేస్తా..
● వైఎస్సార్ సీపీ అద్దంకి ఇన్‌చార్జి అశోక్‌కుమార్
అద్దంకి రూరల్: కూటమి ప్రభుత్వం రానున్న మూడేళ్లలో అద్దంకిలో 100 పడకల ఆస్పత్రి కడితే టీడీపీ కార్యాలయం వద్దకు వచ్చి సెల్యూట్ చేసి క్షమాపణ చెబుతానని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు అద్దంకి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి డాక్టర్ చింతలపూడి అశోక్‌కుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక వీడియో విడుదల చేశారు. కూటమి నాయకులు భోగాపురం ఎయిర్‌పోర్టును 18 నెలల కాలంలోనే పూర్తి చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని, అయితే భోగాపురం పూర్తయ్యేందుకు ఎవరు ఎంత కష్టపడ్డారో ప్రజలకు తెలుసన్నారు. 2008లో అద్దంకి నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు 100 పడకల ఆస్పత్రి లేకపోవటం సిగ్గు చేటన్నారు. అద్దంకి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గొట్టిపాటి రవికుమార్ తన ఛాలెంజ్‌ను స్వీకరించి ముందుకు రావాలని అశోక్‌కుమార్ స్పష్టం చేశారు.
కందుకూరు: కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలు ప్రారంభించడం వల్ల రాష్ట్రంలో మున్సిపాలిటీలు, మండలాల సరిహద్దులు మార్చడం కుదరదని, విలీన గ్రామాల సమస్యతో నిలిచిపోయిన కందుకూరు మున్సిపాలిటీ ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించడం సాధ్యం కాదని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. సోమవారం ఆయన ఆకస్మికంగా కందుకూరు మున్సిపాలిటీలో పర్యటించారు. మొదట ఉప్పుచెరువు రోడ్డులోని ఎంఐజీ లే–అవుట్, టిడ్కో ఇళ్లు, స్విమ్మింగ్ పూల్‌ను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ కోర్టు కేసులతో నిలిచిపోయిన కందుకూరు మున్సిపల్ ఎన్నికలను 2027లో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కందుకూరు నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో కలిసినా నుడా పరిధిలోనే ఉంటుందని, అభివృద్ధి నిధులు కూడా అక్కడ నుంచే విడుదలవుతాయన్నారు.
కొత్తపట్నం: టాస్క్‌ఫోర్స్ పోలీసులు లుంగీలు ధరించి మారువేషంలో వెళ్లి పేకాట శిబిరంపై దాడి చేసి 9 మందిని అరెస్ట్ చేశారు. కొత్తపట్నం మండలం గుండమాల గ్రామ శివారు ప్రాంతంలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం తెలుసుకుని ఒంగోలు నుంచి వచ్చిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం సాయంత్రం ఈ దాడులు చేశారు. పట్టుబడిన 9 మంది నుంచి రూ.4,490 స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కొత్తపట్నం పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. దాడులు చేసిన వారిలో టాస్క్‌ఫోర్స్ ఇన్‌చార్జ్ సీఐ యు.సుధాకర్, ఎస్సై సుదర్శన్, ఏఎస్‌ఐ మహబూబ్‌బాషా, సిబ్బంది ఉన్నారు.
వంద పడకల ఆస్పత్రి కడితే సెల్యూట్ చేస్తా..


