కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వేడుకలు
ఒంగోలు వన్‌టౌన్: నూతన సంవత్సర వేడుకలను స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ పి.రాజాబాబు కేక్ కట్ చేశారు. కలెక్టర్‌ను పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, నగర మేయర్ గంగాడ సుజాత, ఎమ్మెల్యేలు విజయకుమార్, ఇంటూరి నాగేశ్వరరావు, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ, జిల్లా రెవెన్యూ అధికారి చినఓబులేసు, ఒంగోలు, అద్దంకి డివిజన్ల ఆర్డీవోలు లక్ష్మీ ప్రసన్న, వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు. కలెక్టర్‌ను కలిసిన కొందరు హాస్టల్ విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, పరీక్ష ప్యాడ్లు, బ్యాగులు, ఫ్యాన్లు అందించారు.
ఒంగోలు సిటీ: సిలబస్ మార్పులు, సంస్కరణలతో జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనకు కాంట్రాక్ట్ లెక్చరర్లు చిత్తశుద్ధితో కృషి చేయాలని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి కె. ఆంజనేయులు సూచించారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల జేఏసీ ప్రకాశం, మార్కాపురం జిల్లాల ప్రతినిధులు గురువారం ఆయన్ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రానున్న పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ప్రాక్టీకల్, థియరీ పరీక్షల నిర్వహణలో కాంట్రాక్ట్ అధ్యాపకులకు సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని జేఏసీ ప్రతినిధులు కోరారు. ఇంటర్మీడియెట్ విద్యామండలి మార్గదర్శకాల ప్రకారం న్యాయం చేస్తామని డీఐఈఓ హామీ ఇచ్చినట్లు తెలిపారు. జేఏసీ రాష్ట్ర చైర్మన్ కుమ్మరుకుంట సురేష్, నాయకులు బీవీ కాశీరత్నం, వెంకట్రావు తదితరులు ఉన్నారు.


