తల్లడిల్లిన తల్లి మనుసు | - | Sakshi
Sakshi News home page

తల్లడిల్లిన తల్లి మనుసు

Jan 2 2026 12:21 PM | Updated on Jan 2 2026 12:21 PM

తల్లడిల్లిన తల్లి మనుసు

తల్లడిల్లిన తల్లి మనుసు

అవినాష్‌ను ఎస్సై వేమన కొడుతుంటే చూస్తూ తట్టుకోలేకపోయానంటూ అతని తల్లి ఆవేదన ఆ బాధ నుంచి బయటపడలేకపోతున్నా అంటూ రోదన ఇలాంటి పరిస్థితి ఏ తల్లికీరాకూడదంటున్న జయప్రద

పొదిలి: కన్న కొడుకును కళ్ల ముందే ఎవరైనా చావగొడుతుంటే ఏ తల్లీ తట్టుకోలేదు. అందులోనూ వ్యాపారం, కుటుంబం, ఇళ్లు తప్ప మరో యావ లేని బిడ్డను గొడ్డును బాదినట్లు ఎస్సై చావబాదుతుంటే అతని తల్లి తల్లడిల్లిపోయింది. పొదిలిలో ఎస్సై వేమన కొట్టిన దెబ్బలకు అవినాష్‌ శరీరానికి గాయాలవగా, ఆ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన అవినాష్‌ తల్లి జయప్రద మనసుకు తగిలిన గాయం ఇప్పట్లో మానేలా లేదు. ఆ సంఘటనను ఆమె మర్చిపోలేకపోతోంది. గుర్తుకొచ్చిన ప్రతిసారీ ఉలిక్కిపడుతోంది. తన తల్లి రోదిస్తుంటే తన మనసు చివుక్కుమంటోందని, చేయని తప్పుకు ఎందుకు శిక్ష అనుభవించానా అని మానసిక క్షోభకు గురవుతున్నానని అవినాష్‌ కన్నీటి పర్యంతం అవుతున్నాడు. అవినాష్‌పై ఎస్సై వేమన విచక్షణారహితంగా దాడి చేసిన సంఘటనపై అవినాష్‌ తల్లి జయప్రద గురువారం తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేసింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...

ఎరువుల లారీ వచ్చి మా కొట్టు ముందు ఆగింది. ఇరవై బస్తాలు మాత్రమే లారీలో నుంచి కొట్టులోకి దించాల్సి ఉంది. ఆ సమయంలో పోలీస్‌ సైరన్‌ మోగిస్తూ పోలీస్‌ జీపు వచ్చి ఆగింది. లారీని తీయమని పోలీసులు చెబుతున్నారేమో అనుకున్నా. ఎవర్రా లారీ ఇక్కడ పెట్టిందని గద్దిస్తూ ఎస్సై వేమన లారీ డ్రైవర్‌ను కొట్టాడు. తీస్తున్నా సార్‌ అనే లోపే.. ఎవడిదిరా ఈ కొట్టు అంటూ ఎస్సై ఆగ్రహించాడు. సార్‌ సార్‌ అంటూ నా కొడుకు దుకాణం బయటకు వచ్చాడు. అసలు అంతకు ముందే ఏదో జరిగి కక్షపెట్టుకున్నట్లుగా నా కొడుకును లాఠీ తీసుకుని ఎస్సై కొట్టాడు. సార్‌ ఏమైంది సార్‌.. కొట్టొద్దు సార్‌.. అంటూ నా కుమారుడు వేడుకుంటున్నా ఎస్సై పట్టించుకోకుండా ఒల్లంతా వాతలు పడేలా కొట్టాడు. నా కొడుకు చేతికి రక్తపు గాయమైంది. ఎస్సై దెబ్బలు తట్టుకోలేక అమ్మా..అమ్మా అంటూ అల్లాడిపోయాడు. చొక్కా పట్టుకుని లాక్కెళ్లి నా కొడుకును పోలీసు జీపులో ఎస్సై ఎక్కించాడు. సార్‌..సార్‌ ఎందుకు తీసుకెళ్తున్నారో చెప్పండి సార్‌ అంటూ నేను ఏడుస్తూ ఎస్సైని అడిగాను. అయినా పట్టించుకోకుండా కొట్టుకుంటూ బూతులు తిడుతూ జీపులో ఎక్కించుకుని పోలీస్‌స్టేషన్‌కి తీసుకెళ్లాడు. అంతలో నా భర్త కోటేశ్వరరావు దుకాణం వద్దకు రాగా, జరిగిన విషయం చెప్పాను. వెంటనే పోలీస్‌ స్టేషన్‌ వద్దకు వెళ్లిన నా భర్తపై కూడా ఎస్సై దారుణంగా దాడి చేశాడు. ఆ దెబ్బలతో అవమానంగా ఇంటికి వచ్చిన నా భర్తను, కొడుకును చూసి నేను, నా కోడలు భోరున విలపించాము. అవినాష్‌ గవర్నమెంట్‌ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడి నుంచి పోలీసులు మళ్లీ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ విషయాన్ని నా కొడుకు నాకు ఫోన్‌ చేసి చెప్పడంతో తీవ్ర ఆందోళన చెందాము. పోలీసులకు ఫోన్‌ చేశాను. సార్‌ మా బిడ్డను ఏమీ చేయొద్దు సార్‌.. ఇప్పటికే దెబ్బలు తగిలి అల్లాడిపోతున్నాడంటూ వేడుకున్నాను. పది నిముషాల్లో పంపిస్తామని పోలీసులు సమాధానం చెబుతున్నారేగానీ పంపించలేదు. సార్‌ అవినాష్‌ను పంపించండి సార్‌.. దెబ్బలు తగిలాయి.. మా నాయన ఏడని నా మనమడు కూడా ఏడుస్తున్నాడు.. పంపించండి సార్‌ అంటూ పలుమార్లు వేడుకున్నాము. అర్ధరాత్రి దాటిన తర్వాత బిడ్డను పంపించారు. ఇంట్లో అందరం ఏడ్చుకుంటూ కూర్చున్నాము. మనం ఏం తప్పు చేశామని ఈ శిక్ష అంటూ మానసిక క్షోభ అనుభవించాము.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement