పతనానికి చేరువైన చంద్రబాబు ప్రభుత్వం
● వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి ఆదిమూలపు సురేష్
సింగరాయకొండ:
చంద్రబాబు ప్రభుత్వం అమరావతి రైతులను మోసం చేస్తూ ఈవెంట్ మేనేజర్ మాదిరిగా ప్రభుత్వాన్ని నడిపిస్తోందని, రెండేళ్ల పాలన కూడా పూర్తవకుండానే పతనానికి చేరువైందని, ప్రజల్లో ఉన్న నైరాశ్యమే అందుకు నిదర్శనమని వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి, పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. సింగరాయకొండ మండల కేంద్రంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో గురువారం నూతన సంవత్సర వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటివరకు గ్రాఫిక్స్ చూపిస్తూ అమరావతికి లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నామని, 50 వేల ఎకరాలు కావాలని అక్కడి రైతులను మోసం చేస్తోందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ పాలన దినదిన గండం.. నూరేళ్ల ఆయుష్షులా సాగుతోందన్నారు. సమాజంలో ఏ ఒక్కరూ సంతృప్తిగా లేరన్నారు. అదే సమయంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల్లో జోష్ పెరిగిందని, పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలో అట్టహాసంగా నూతన సంవత్సర వేడుకలు జరిగాయని తెలిపారు. పోలీసుల దౌర్జన్యాలు, ఏకపక్షంగా వ్యవహరిస్తున్న వ్యవస్థలు వైఎస్సార్ సీపీ శ్రేణులు మరింత రాటుతేలేలా చేశాయన్నారు. రాబోయే రోజుల్లో ప్రజల తరఫున ఎలాంటి పోరాటాలు చేయడానికై నా వైఎస్సార్ సీపీ కేడర్ సిద్ధమవుతోందన్నారు.
కొండపిలో హద్దులు దాటిన అవినీతి...
కొండపి నియోజకవర్గంలో టీడీపీ నాయకుల అవినీతి హద్దులు దాటిందని, ప్రజావ్యతిరేకత భారీగా మూటగట్టుకుంటోందని ఆదిమూలపు సురేష్ విమర్శించారు. గురువారం జరిగిన నూతన సంవత్సర వేడుకలు టీడీపీలో పూర్తి నైరాశ్యాన్ని నింపాయన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో పార్టీ కార్యక్రమాలతో దూసుకెళ్లేందుకు వైఎస్సార్ సీపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఒక్కో నియోజకవర్గంలో 8 వేల పైచిలుకు కార్యకర్తలతో రాష్ట్రంలో 15 లక్షల మందితో జగనన్నకు బలమైన సైన్యం తయారవుతోందన్నారు. జగనన్నను సీఎం చేసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు ఎలాంటి తాయిలాలు, శుభవార్తలు, వరాలు ప్రకటించలేదని సురేష్ విమర్శించారు. ప్రజలందరూ ఎంతో నిరాశ నిస్పృహలతో ఉన్నారని, అరకొరగా ఇచ్చిన పథకాలు రాష్ట్ర ప్రజలను నైరాశ్యంలోకి నెట్టేశాయని అన్నారు.


