వేడుక.. కిక్కెక్కింది..!
మత్తుమత్తుగా కొత్త సంవత్సరానికి స్వాగతం డిసెంబర్ 30, 31 తేదీల్లో ఉమ్మడి జిల్లాలో రూ.30 కోట్లకుపైగా మద్యం అమ్మకాలు ఒంగోలు నగర శివారులో ఏరులై పారిన మద్యం హాట్ కేకుల్లా అమ్ముడుబోయిన కేకులు రెండు రోజుల్లో లక్షకుపైగా బిర్యానీలు లాగించేసిన నగర ప్రజలు అర్ధరాత్రి వరకు తాగి తందనాలతో సంబరాలు
కొత్త ఏడాది పేరుతో జిల్లా మొత్తం మద్యం మత్తులో మునిగింది. ప్రభుత్వం అధికారికంగా ప్రోత్సహించిన మత్తు సంబరంగా మారింది.
చంద్రబాబు పాలనలో నూతన సంవత్సరం వేడుకల్లో మద్యం ఏరులై పారింది. అర్ధరాత్రి వరకు దుకాణాలు తెరిచి, బెల్టుషాపులకు అడ్డుకట్ట
లేకుండా, ఈవెంట్ల పేరుతో రూ.కోట్లల్లో లిక్కర్ తాగించింది. రెండు రోజుల్లో రూ.30 కోట్ల
మద్యం అమ్మకాలు జరిగాయంటే ప్రజల
ఆనందం పేరుతో సర్కారు దోపిడీకి తెగబడిందని అర్థమవుతోంది. ‘స్వర్ణాంధ్ర’ను ‘మద్య ఆంధ్ర’గా మార్చింది. ఇక కేకులు, బిర్యానీలు సైతం హాట్ హాట్‌గా అమ్మకాలు జరిగాయి.
10 వేల కేకులు కట్...
నూతన సంవత్సర వేడుకలకు కులమతాలకు అతీతంగా కేకులు కట్ చేశారు. దీంతో నగరంలో నూతన సంవత్సరం ఒక్క రోజే సుమారు 10 వేలకుపైగా కేకులు అమ్ముడుపోయాయి. ఒంగోలు నగరంలో మొత్తం 25కుపైగా చిన్న, పెద్ద బేకరీలు ఉన్నాయి. ఇందులో ఒక ప్రముఖ బేకరీలోనే 1200 కిలోల కేకులు అమ్ముడుపోయినట్లు తెలిసింది. ఇక పూలదండలు, బొకేల వ్యాపారం కూడా రూ.లక్షల్లో జరిగినట్లు సమాచారం.
ఒంగోలు టౌన్: జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు మత్తుమత్తుగా జరిగాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మద్యం విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వం మద్యం దుకాణాలు, బార్ల సమయాలను అర్ధరాత్రి వరకూ పొడిగించడం, గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టుషాపులు ఉండటంతో 24/7 అమ్మకాలు సాగాయి. డిసెంబర్ చివరి రెండు రోజులు జరిగిన మద్యం అమ్మకాలు చూసి ఎకై ్సజ్ అధికారులు సైతం విస్తుపోయారు. ఒంగోలు నగర శివారులో ఏర్పాటు చేసిన ఒక ఈవెంట్‌లో ఒక్కరోజు రాత్రే సుమారు 40 లక్షల రూపాయల విలువ చేసే మద్యం ఏరులై పారినట్లు నగరంలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
రూ.30 కోట్ల రూపాయల
మద్యం విక్రయాలు...
జిల్లాలో నూతన సంవత్సర వేడుకల్లో బీరు కంటే లిక్కర్ వ్యాపారమే ఎక్కువగా జరిగింది. ఒంగోలు మద్యం డిపో పరిధిలో కందుకూరు, సింగరాయకొండ, ఒంగోలు, చీరాల, పర్చూరు, అద్దంకి, చీమకుర్తి ఎక్సైజ్ సర్కిళ్లు ఉన్నాయి. డిసెంబర్ 30వ తేదీ ఒంగోలు ఎకై ్సజ్ సర్కిల్ పరిధిలో 2435 కేసుల లిక్కర్, 933 కేసుల బీరు విక్రయాలు జరిగాయి. కందుకూరు సర్కిల్ పరిధిలో 1149 కేసుల లిక్కర్, 366 బీరు కేసులు అమ్ముడుపోయాయి. అద్దంకి సర్కిల్ పరిధిలో 1017 కేసుల లిక్కర్, 305 కేసుల బీర్లు తాగారు. చీరాల పరిధిలో 921 లిక్కర్, 335 బీరు కేసులు, సింగరాయకొండ పరిధిలో 826 లిక్కర్, 270 బీర్ల కేసులు అమ్ముడు పోయాయి. పర్చూరు పరిధిలో 686 లిక్కర్, 221 బీర్లు, చీమకుర్తి పరిధిలో 503 లిక్కర్, 228 బీర్ల కేసుల విక్రయాలు జరిగాయి. మొత్తం 7537 లిక్కర్, 2658 బీర్ల కేసులు విక్రయించగా, రూ.6,05,12,814 వ్యాపారం జరిగింది.
డిసెంబర్ 31 రూ.6,29,24,874 విలువైన వ్యాపారం...
డిసెంబర్ 31వ తేదీ ఒంగోలు సర్కిల్ పరిధిలో 2057 లిక్కర్, 863 బీర్ కేసులు అమ్ముడయ్యాయి. పర్చూరు సర్కిల్ పరిధిలో 1167 లిక్కర్, 310 బీర్ కేసులు, చీరాల సర్కిల్ పరిధిలో 1163 లిక్కర్, 505 బీర్ కేసుల విక్రయాలు జరిగాయి. అద్దంకి పరిధిలో 1125 లిక్కర్, 311 బీర్ కేసులు, సింగరాయకొండ పరిధిలో 922 లిక్కర్ కేసులు, 231 బీర్ కేసులు తాగేశారు. చీమకుర్తి పరిధిలో 846 లిక్కర్ కేసులు, 281 బీర్ కేసులు, కందుకూరు పరిధిలో 508 లిక్కర్, 128 బీర్ కేసులు లాగించేశారు. మొత్తం 7788 లిక్కర్ కేసులు తాగారు. 2629 కేసుల బీర్లు కూడా పీకలదాకా ఎక్కించేశారు. రూ.6,29,24,874 విలువైన వ్యాపారం జరిగింది.
మార్కాపురం మద్యం డిపో పరిధిలోనూ భారీగా అమ్మకాలు...
మార్కాపురం డిపో పరిధిలో యర్రగొండపాలెం, మార్కాపురం, కంభం, గిద్దలూరు, కనిగిరి, దర్శి, పొదిలి ఎకై ్సజ్ సర్కిళ్లు ఉన్నాయి. ఈ డిపో పరిధిలో డిసెంబర్ 1 నుంచి 31వ తేదీ వరకు రూ.61 కోట్ల వ్యాపారం జరగ్గా, చివరి రెండు రోజులే సుమారు 10 కోట్ల రూపాయలకుపైగా అమ్మకాలు జరిగినట్లు సమాచారం. ఇది కాకుండా నూతన సంవత్సరం వేడుకల కోసం ముందస్తుగా కొనుగోలు చేసిన మద్యం సుమారు రూ.5 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకూ ఉండొచ్చని తెలుస్తోంది. మొత్తంగా సుమారు రూ.30 కోట్ల విలువజేసే మద్యాన్ని పీలకదాకా తాగించింది చంద్రబాబు ప్రభుత్వం.
ఒక్కరాత్రే 40 లక్షల రూపాయల మద్యం...
ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకలు నగరంలో నింగినంటాయి. ఈ వేడుకల్లో మద్యం ఏరులైపారింది. నగర శివారులో ఇటీవల ఒక వెంచర్ వేశారు. అందులో డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఒక ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకల కోసం రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల మద్యం కొనుగోలు చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీని కోసం నిర్వాహకులు నగరంలోని మద్యం దుకాణాలతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా మద్యం కొనుగోలు చేసినట్లు చెప్పుకుంటున్నారు. ఈవెంట్‌లో పాల్గొనేందుకు రూ.1499 నుంచి రూ.19,999 వరకూ టికెట్ ధర వసూలు చేశారు. ఈవెంట్ల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా లైసెన్సులు జారీ చేయడం గమనార్హం. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు నిర్వాహకులు విచ్చలవిడిగా మద్యం అందుబాటులో ఉంచినట్టు చెవులు కొరుక్కుంటున్నారు. అధికార పార్టీ అండదండలు పుష్కలంగా వుండడంతో పోలీసులు, ఎకై ్సజ్ అధికారులు ఎవరూ అటువైపు కన్నెత్తి చూడలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకూ నగరంలో నూతన సంవత్సర ఈవెంట్లు చాలా జరిగాయి. అయితే ఈ దఫా కొత్తగా మద్యం చేర్చడంపై నగరవాసులు మండిపడుతున్నారు. ఈ తరహా సంస్కృతి సరికాదని అంటున్నారు.
రెండు రోజుల్లో లక్షకుపైగా బిర్యానీలు..
ఇటీవల ఒంగోలులో బిర్యానీ కల్చర్ బాగా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా బిర్యానీ పాయింట్లు కనిపిస్తున్నాయి. రోజూ బిర్యానీ తినేవారి సంఖ్య ఎక్కువైనట్లు నివేదికలు చెబుతున్నాయి. నగరంలోని ప్రముఖ హోటళ్లలో రోజుకు 1000కిపైగా బిర్యానీలు అమ్ముడుపోతున్నట్లు సమాచారం. నూతన సంవత్సర సంబరాలలో ఈ సంఖ్య రెట్టింపైందని తెలిసింది. డిసెంబర్ 31వ తేదీ 2500 నుంచి 3000 బిర్యానీలు అమ్ముడుపోయినట్లు ఓ హోటల్ యాజమాని చెప్పారు. ఒంగోలు నగరంలో ఇలాంటి పెద్ద హోట ళ్లు, రెస్టారెంట్లు 30 వరకు ఉన్నాయి. దీంతోపాటు వీధికో బిర్యానీ పాయింట్ ఉంది. ఇవి సుమారు 50కిపైగా ఉన్నాయి. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఒక్కరోజే 50 వేలకుపైగా బిర్యానీలు లాగించేసినట్లు సమాచారం. 30, 31 తేదీల్లో లక్షకుపైగా బిర్యానీలు బిగించినట్లు తెలుస్తోంది.
వేడుక.. కిక్కెక్కింది..!
వేడుక.. కిక్కెక్కింది..!


