రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
అద్దంకి: బైక్‌ను కారు ఢీకొట్టిన ఘటనలో భార్యభర్తలకు తీవ్ర గాయాలు కాగా భార్య మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని అద్దంకి–దర్శి రహదారిలోని తిమ్మాయపాలెం గ్రామ సమీపంలోని గుండ్లకమ్మ వంతెనపై గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే..ముండ్లమూరు మండలంలోని పోలవరం గ్రామానికి చెందిన చల్లా ఏడుకొండలు, అతని భార్య రవణ (45 ) గేదెలకు తౌడు తీసుకుని రావడం కోసం భర్త టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై ఎక్కి అద్దంకి వెళుతున్నారు. ఈ క్రమంలో వారి వాహనం గుండ్లకమ్మ వంతెనపైకి రాగానే ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని కారు ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో భార్యభర్తలు ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ముండ్లమూరు 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చేరుకునే లోపే రవణ మృతి చెందింది. భర్త పరిస్థితి విషమంగా ఉండటంతో ఒంగోలు వైద్యశాలకు తరలించారు. ఉన్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకుంటూ గేదెలను మేపుకుంటూ జీవనం సాగించే ఏడుకొండలకు ఇద్దరు కుమారులు కాగా.. హైదరాబాద్‌లో బేల్దారీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. సంఘటన వివరాలు తెలసుకున్న పోలీసులు కేసు నమోదుతో దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.


