మార్కాపురం జిల్లా అభివృద్ధికి కృషి
ఇన్‌చార్జి కలెక్టర్ రాజాబాబు మార్కాపురం జిల్లా ప్రారంభోత్సవంలో పాల్గొన్న అధికారులు, ప్రజా ప్రతినిధులు
మార్కాపురం: నూతనంగా ఏర్పాటైన మార్కాపురం జిల్లా అభివృద్ధికి కలిసికట్టుగా కృషిచేస్తామని ఇన్‌చార్జి కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ రాజాబాబు తెలిపారు. మార్కాపురం జిల్లా ఏర్పాటులో భాగంగా బుధవారం తర్లుపాడు రోడ్డులోని వెలుగొండ పునరావాస కాలనీలో నిర్మించిన హైస్కూల్‌లో నూతన జిల్లా కలెక్టరేట్‌ను మంత్రి బాలవీరాంజనేయస్వామితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధికి అందరం కలిసి కృషి చేస్తామన్నారు. నూతన కలెక్టరేట్ భవనానికి ప్రభుత్వం నిధులిస్తామని తెలిపిందని, అదికూడా ఏర్పాటు చేస్తామన్నారు. మార్కాపురంలో అన్నీ ప్రభుత్వ కార్యాలయాల బోర్డుల్లో మార్కాపురం జిల్లాను వెంటనే చేర్చాలని ఆదేశించారు. జిల్లా బోర్డులను ఏర్పాటు చేయాలని తెలిపారు. జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తామన్నారు. మంత్రి బాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ 2026లో వెలుగొండ ప్రాజెక్టును పూర్తిచేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎస్‌పీ హర్షవర్ధన్‌రాజు, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు ఎమ్మెల్యేలతో పాటు డీఆర్‌ఓ ఓబులేసు, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన కలెక్టరేట్‌లో ఇన్‌చార్జి కలెక్టరుగా రాజాబాబు బాధ్యతలు స్వీకరించిన అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు.


