మార్కాపురం కౌన్సిల్ సమావేశం వాయిదా
సమావేశంలో మాట్లాడుతున్న చైర్మన్ కృష్ణ
హాజరైన కౌన్సిలర్లు
మార్కాపురం టౌన్: మార్కాపురం మున్సిపల్ సమావేశం కోరంలేక బుధవారం వాయిదా పడింది. పురపాలక సంఘం పరిధిలో ప్రజల సమస్యల పరిష్కారంతో పాటు మున్సిపల్ సమావేశం నిర్వహించి అధికారులు, నాయకులు గుర్తించిన పలు అభివృద్ధి పనులపై చర్చించి వాటి అమోదం కోసం కౌన్సిల్ మీటింగ్ ఎర్పాటు చేస్తారు. అయితే బుధవారం జరిగిన కౌన్సిల్ సమావేశానికి కౌన్సిలర్‌లు, అధికారులు రాకపోవడంతో పాటు కోరం కూడా లేక వచ్చే నెలకు చైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ వాయిదా వేశారు. ఈ సందర్భంగా చైర్మన్ కృష్ణ మాట్లాడుతూ జిల్లా ఏర్పాటుతో మార్కాపురానికి ఇన్‌చార్జి కలెక్టర్ రాజబాబు, ఎస్పీ హర్షవర్దన్‌రాజుతో పాటు పలువురు అధికారులు వచ్చి బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని పట్టణ ప్రథమ పౌరుడైన తనకు కనీస ఆహ్వానం లేకుండా ప్రొటోకాల్ మరిచారని మండిపడ్డారు. పట్టణ పరిధిలో కార్యాలయాల ప్రారంభం సందర్భంగా సున్నం, బ్లీచింగ్ తదితర పారిశుధ్య పనులకు కౌన్సిల్ ఆమోదించిన వస్తువులు మాత్రం అవసరమని ఎద్దేవా చేశారు. పట్టణ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన కౌన్సిల్ మీటింగ్‌కు సభ్యులు రాకపోవటంతో పాటు జిల్లా అధికారులు మార్కాపురం వస్తున్నారన్న విషయం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు కూడా సమావేశానికి హాజరు కాకపోవటంతో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను గాలికి వదిలేసి మంత్రి, ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునేందుకు అధికారులు ముందున్నారన్నారు. మున్సిపల్ సమావేశానికి వైస్ చైర్మన్–2 చాతరాజుపల్లి అంజమ్మ శ్రీనివాసులు, కౌన్సిలర్‌లు సిరాజ్, కొత్త కృష్ణ, సలీం, ముంగుమూరి శ్రీనివాసులు, భాను, దేవకరుణమ్మ, చాటకొండ చంద్రశేఖర్, కో ఆప్షన్ మెంబర్ గుంటక వనజాక్షి హాజరయ్యారు.
కోరం లేకపోవడమే కారణం
ప్రొటోకాల్ పాటించని కూటమి నాయకులు
మండిపడిన మున్సిపల్ చైర్మన్ కృష్ణ
మార్కాపురం కౌన్సిల్ సమావేశం వాయిదా


