మహిళ హత్య కేసులో జీవిత ఖైదు
ఒంగోలు: మహిళను హత్య చేసి మృతదేహాన్ని దహనం చేసిన కేసులో ఒకరికి జీవిత ఖైదు విధిస్తూ 8వ అదనపు జిల్లా, ఫ్యామిలీ కోర్టు జడ్జి జి.దీన బుధవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. 2019 సెప్టెంబర్ 7న మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కూచిపూడి–చెంచిరెడ్డిపల్లి సమీపంలోని ఆంధ్రాకొండ వద్ద ఓ మహిళను హత్య చేసి అనంతరం మృతదేహాన్ని దహనం చేసినట్లు గుర్తించిన పోలీసులు మృతురాలు కనిగిరికి చెందిన షేక్ అలియాస్ పొలిచర్ల రజియాబేగం (35)గా గుర్తించారు. ఆమెకు షేక్ ఖాదర్‌బాషాతో ఐదేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ఆమె మరో వ్యక్తితో కూడా వివాహేతర సంబంధం కొనసాగిస్తుందన్న అనుమానం పెంచుకుని ఆమెను కడతేర్చాలని ఖాదర్‌బాషా పథకం రచించాడు. అందులో భాగంగా ఆమెను మోటారు బైకుపై సంఘటన స్థలానికి తీసుకెళ్లి తన లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. అనంతరం ఆమెను హత్య చేసి షేక్ జిలానిబాషా అనే వ్యక్తితో కలిసి పెట్రోలు, కిరోసిన్ పోసి తగులబెట్టాడు. దీనిపై మృతురాలి తల్లి షేక్ మీరాబీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి సీఐలు టీవీవీ ప్రతాప్‌కుమార్, కె.వెంకటేశ్వరరావు, ఎస్సై జి.శివన్నారాయణలు దర్యాప్తు జరిపి నిందితులను అరెస్టు చేయడంతో పాటు కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి ప్రధాన నిందితుడు షేక్ ఖాదర్‌బాషాపై నేరం రుజువైనట్లు పేర్కొంటూ అతనికి జీవిత ఖైదు, రూ.15 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. రెండో నిందితుడు జిలానిబాషాపై నేరం రుజువు కాలేదని పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.శీనారెడ్డి వాదించగా కోర్టు లైజన్‌లు ఏఎస్సై సత్యశ్రీనివాస్, షేక్ ఇమామ్ హుస్సేన్‌లు కేసు విచారణను వేగవంతం చేసి సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపరిచి నేర నిరూపణకు సహకరించారు.
టీడీపీ కార్యకర్తపై సీఐ దాడి
లింగసముద్రం: టీడీపీ కార్యకర్త వెన్నపూస నాగిరెడ్డిని గుడ్లూరు సీఐ మంగారావు కొట్టడంతో గ్రామస్తులు ఎదురుతిరిగిన సంఘటన మండలంలోని మొగిలిచర్ల పంచాయతీ నరసింహాపురంలో బుధవారం సాయంత్రం 7.30 గంటల సమయంలో జరిగింది. అందిన వివరాల ప్రకారం.. గ్రామంలో సిమెంట్ రోడ్డు వేసేందుకు అడ్డుగా ఉన్న పేడదిబ్బలు తొలగించే విషయంలో గ్రామస్తులు కొందరు అడ్డుతగిలారు. ఇక్కడ సిమెంటు రోడ్డు అవసరం లేదని, కావాలని వేస్తున్నారని కాంట్రాక్టర్‌ను అడ్డుకున్నారు. రెండు రోజుల క్రితం రెవెన్యూ అధికారులు వచ్చి అది ప్రభుత్వ భూమిగా తేల్చారు. నివాసాలు ఉన్నచోట సిమెంటు రోడ్డు నిర్మాణం చేపట్టాలని, అవసరం లేని చోట ఎందుకు వేస్తున్నారని అధికారులను గ్రామస్తులు నిలదీశారు. దీంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో సీఐ మంగారావు, ఎస్సై నారాయణలు తమ సిబ్బందితో కలిసి నారసింహాపురం వెళ్లి గొడవకు కారణాలు తెలుసుకునే ప్రయత్నంలో వెన్నపూస నాగిరెడ్డిపై చేయి చేసుకున్నారు. మనస్తాపం చెందిన నాగిరెడ్డి పురుగుమందు తాగేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామంలోని మహిళలు పోలీసుల వైఖరిపై నిరసన వ్యక్తం చేయడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
పురుగుమందు తాగబోయిన కార్యకర్త
పోలీసులకు ఎదురుతిరిగిన గ్రామస్తులు


