ఆర్ధవీడు: పాపినేనిపల్లె ఫారెస్టు బీట్ పరిధిలోని నారాయనపల్లి గ్రామ కొండ అంచు వ్యవసాయ పొలాల్లో ఆవుపై అడవి మృగం దాడి చేసి చంపింది. బొప్పాయి తోటలో ఆవు మరణించి ఉండటాన్ని రైతులు బుధవారం మధ్యాహ్నం గుర్తించారు. ఆవు మెడ, ఎడమ కాలిపై మృగం కొరికిన ఆనవాళ్లు ఉండటంతో పులి దాడి చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. పులి సంచరిస్తోందన్న వార్త ఆనోటా ఈనోటా తెలియడంతో నారాయనపల్లితోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఆవు మృతి చెందిన విషయం అటవీ శాఖ అధికారులకు తెలియజేయడంతో ట్రాప్ కెమెరాలు అమర్చారు. బుదవారం రాత్రి కెమెరాల ఫుటేజీని పరిశీలించి ఏ జంతువు దాడి చేసిందో నిర్ధారిస్తామని ఫారెస్ట్ బీట్ అధికారి మురళీకృష్ణ తెలిపారు.
ఆర్మీ జవాన్ మృతిపై కేసు నమోదు
కొమరోలు: మండలంలోని తాటిచెర్ల గ్రామంలో ఆర్మీ జవాన్ రవి(41) మంగళవారం ఉదయం మృతి చెందారు. రాజస్థాన్‌లో విధులు నిర్వహిస్తున్న ఆయన సెలవుపై గత సోమవారమే స్వగ్రామానికి చేరుకున్నారు. మంగళవారం ఉదయం వేకువజామున కుటుంబ సభ్యులు ఎంతగా పిలిచినా లేవకపోవడంతో మృతి చెందినట్లు నిర్ధారించుకున్నారు. రవి తల్లి రత్నమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగరాజు బుధవారం తెలిపారు. మృతదేహాన్ని గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనారోగ్యంతో మరణించారా మరేదైనా కారణమా అనేది పోస్టుమార్టంలో వెల్లడవుతుందని ఎస్సై చెప్పారు.


