కంది పోయేంత కష్టం..! | - | Sakshi
Sakshi News home page

కంది పోయేంత కష్టం..!

Dec 23 2025 7:20 AM | Updated on Dec 23 2025 7:20 AM

కంది

కంది పోయేంత కష్టం..!

కనిగిరి రూరల్‌:

జిల్లాలో సాగుచేసిన కంది పంట ప్రస్తుతం పూత, పిందె, కాయ దశలో ఉంది. పూత మెండుగా రావడంతో కళకళలాడుతుండగా, ఒక్క తడి కోసం రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. 2025–26 పంటకు సంబంధించి ఖరీఫ్‌ సీజన్‌లో వేసిన కంది ఏపుగా పెరిగింది. పూత, పిందె దశకు చేరుకుంది. లేట్‌ ఖరీఫ్‌, ఎర్లీ రబీలో వేసిన కందికి మాత్రం తడులు అవసరమని రైతులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా మంచు తీవ్రంగా పడుతోంది. సరైన నీటి తడులు లేని చోట బెట్టకు వచ్చింది. ఏపుగా పెరిగిన కంది మొక్కలు సాయంత్రానికి ఢీలా పడి నేలవాలుతున్నాయి. దానికితోడు పూత, పిందె, కాయకు తెగుళ్లు ఆశిస్తుండటంతో అన్నదాత ఆందోళన చెందుతున్నాడు. బాగా కళకళలాడుతున్న పంట తెగుళ్ల ధాటికి విలవిల్లాడుతుండటంతో సస్యరక్షణ చర్యల్లో రైతన్న నిమగ్నమయ్యాడు.

జిల్లాలో అత్యధికంగా కనిగిరిలోనే

కంది సాగు..

జిల్లాలోని 36 మండలాల్లో 2024–25లో 73,303 హెక్టార్లకుగానూ 70,967 హెక్టార్లలో కంది పంట సాగు చేశారు. ఈ ఏడాది 2025–26లో ఖరీఫ్‌ కింద కంది సాధారణ విస్తీర్ణం 68,287 హెక్టార్లు కాగా, 76,087 హెక్టార్లలో సాగు విస్తీర్ణంగా నమోదైంది. రబీలో 99 హెక్టార్లలో సాగు చేశారు. జిల్లాలో అత్యధికంగా కంది సాగు చేసే వ్యవసాయ సబ్‌ డివిజన్‌లలో కనిగిరి ఒకటి. కనిగిరి ప్రాంతంలో అత్యధికంగా సాగు చేసే ప్రధాన పంట కంది. వ్యవసాయ సబ్‌ డివిజన్‌లోని ఆరు మండలాల్లో ఖరీఫ్‌లో సాధారణ విస్తీర్ణం 29,050 హెక్టార్లు కాగా, సాగు విస్తీర్ణం 37,118 వరకు ఉంది. రబీలో సాధారణ విస్తీర్ణం 24,361 హెక్టార్లు కాగా.. ఇప్పటి వరకు 9,060 హెక్టార్లకుపైగా వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. అత్యధికంగా కంది సాధారణ విస్తీర్ణం 15,193 హెక్టార్లు కాగా, ఇప్పటి వరకు 21,969 హెక్టార్లలో సాగు చేశారు. కనిగిరి మండలంలో 9,613 హెక్టార్లు, పామూరులో 1,712 హెక్టార్లు, వెలిగండ్ల 4,164 హెక్టార్లు, హెచ్‌ఎం పాడు 724 హెక్టార్లు, సీఎస్‌ పురం 621 హెక్టార్లు, పీసీ పల్లిలో 5,119.3 హెక్టార్లలో పంట వేసినట్లు ఇప్పటి వరకు నివేదికలున్నాయి. ఇవి గాక లేట్‌ ఖరీఫ్‌ కింద కొందరు రైతులు కంది సాగుచేశారు. ఇటీవల తుఫాన్‌ వల్ల కురిసిన వర్షాలకు అక్కడక్కడా నీటి మునిగిన పైరు కొంత దెబ్బతిన్నా.. మిగతా పంట సుమారు 3, 4 అడుగుల ఎత్తు పెరిగి పూత దశలో ఉంది.

ఆశిస్తున్న తెగుళ్లు...

ఖరీఫ్‌లో వేసిన కంది పైరు ఎక్కువ శాతం పూత, పిందె, కాయ దశలో ఉంది. మేలైన దిగుబడులు సాధించాలంటే పైరు తెగుళ్ల బెడద నుంచి రైతు తప్పించుకోవాలి. కందికి ప్రస్తుత దశలో మారుకా మచ్చల పురుగు, కాయ ఈగ, కాయ తొలుచు పురుగు, వెర్రి తెగులు పురుగు, గూడు పురుగు, తెల్లపురుగు ఆశిస్తోంది. కనిగిరి ప్రాంతంలో మారుకా మచ్చ పురుగు, (గూడు పురుగు), తెల్లపురుగు ఆశిస్తున్నట్లు చెప్పారు. మారుకా మచ్చ పురుగు మొగ్గ లోపల ఉండి తింటోంది. తర్వాత లేత ఆకులు, పూత పిందె కాయలను కలిపి గూడుగా చేసుకుని తింటుంది. కాయ అడుగు భాగంలో చిన్న రంధ్రం వేసి లోపలకి వెళ్లి గింజలు తిని కాయలను డొల్ల చేస్తోంది. మరో వైపు పూత దశలో ఉన్న కంది ఉదయాన్నే మంచుకు కళకళలాడినా.. సాయంత్రానికి సరైన తడులు లేకపోతే బెట్టకు వచ్చి నేలకు వాలుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

కంది పంటను ఆశించిన తెల్ల పురుగు

కంది పంటపై పురుగుల దాడి

విపరీతంగా ఆశిస్తున్న తెగుళ్లు

ఉదయం కళకళ.. సాయంత్రానికి డీలా..!

దిక్కుతోచని స్థితిలో రైతన్న

జిల్లాలో 76,087 హెక్టార్లలో

కంది పంట సాగు

కనిగిరి వ్యవసాయ సబ్‌ డివిజన్‌లో అత్యధికంగా 37,118 హెక్టార్లలో పంట

కంది పోయేంత కష్టం..! 1
1/2

కంది పోయేంత కష్టం..!

కంది పోయేంత కష్టం..! 2
2/2

కంది పోయేంత కష్టం..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement