ఉంగరం కోసమే హత్య
సింగరాయకొండ: టంగుటూరులో జరిగిన హత్య కేసును పోలీసులు నాలుగు రోజుల్లో ఛేదించారు. మృతుడు నిందితునికి రూ.7 వేలు ఇవ్వాల్సి ఉండగా..ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదు. దీంతో అతన్ని చంపి, చేతికి ఉన్న ఉంగరాన్ని తీసుకోవాలని పథకం ప్రకారమే హత్య చేశాడు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. టంగుటూరుకు చెందిన మృతుడు రమణయ్య, జరుగుమల్లి మండలం వావిలేటిపాడుకు చెందిన నిందితుడు ఏడుకొండలు గతంలో స్థానికంగా రొయ్యల ఫ్యాక్టరీల్లో పనిచేశారు. ప్రస్తుతం రమణయ్య బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా, ఏడుకొండలు విజయవాడలో ర్యాపిడ్‌లో పనిచేస్తున్నాడు. గతంలో ఏడుకొండలు మృతుడు రమణయ్యకు రూ.7 వేలు అప్పుగా ఇచ్చాడు. ఎన్నిసార్లు అడిగినా నగదు ఇవ్వకపోవడంతో చేతికి రమణయ్యను హత్య చేసి చేతికి ఉన్న ఉంగరం చోరీ చేయాలని నిర్ణయించాడు. ఆ ప్రకారం ఈ నెల 16వ తేదీ పథకం ప్రకారం ఒంగోలు నుంచి వచ్చిన ఏడుకొండలు టంగుటూరులోని రమణయ్య ఇంటికి వెళ్లి అతనితో కలిసి అర్ధరాత్రి సుమారు 12:30 గంటల వరకు మద్యం సేవించారు. అనంతరం పథకం ప్రకారం వెంట తెచ్చుకున్న సుత్తితో రమణయ్య తలపై కొట్టాడు. కొన ఊపిరితో ఉండగా ఇంట్లో ఉన్న కత్తితో గొంతు కొసి ఉంగరం తీసుకొని ఉడాయించాడు. తొలుత ఎటువంటి ఆధారాలు దొరకలేదన్నారు. హత్య కేసును సింగరాయకొండ సీఐ సీహెచ్ హజరత్తయ్య, ఎస్సైలు బి.మహేంద్ర, నాగమల్లేశ్వరరావు, బి.మహేంద్ర, సిబ్బంది కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి చాకచక్యంగా నాలుగురోజుల్లో కేసును ఛేదించి ఆదివారం నిందితున్ని అరెస్టు చేశామన్నారు.
టంగుటూరు హత్య కేసును ఛేదించిన పోలీసులు
విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడి


