న్యాయ సమస్యలు పరిష్కరించి కానిస్టేబుల్ ఉద్యోగాలు
● రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత
ఒంగోలు టౌన్: పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు గత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని, న్యాయపరమైన చిక్కులతో ఆగిపోయిన ప్రక్రియను తాము వచ్చాక క్లియర్ చేసి ఉద్యోగాలు ఇచ్చినట్లు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత చెప్పారు. పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థులకు ఒంగోలు పీటీసీలో నిర్వహించనున్న శిక్షణ తరగతులను సోమవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ 6,100 పోస్టులకు సుమారు 40 లక్షల మంది పోటీ పడ్డారని, లక్షలాది మందితో పోటీపడి నెగ్గి ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. పోలీసు శాఖలో మిగిలిన పోస్టులను కూడా భర్తీ చేస్తామని, ప్రతి ఏడాది పోలీసు, టీచర్ పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పోలీసంటే భయం, గౌరవం కనిపించాలని, అప్పుడే ప్రజల్లో పోలీసు శాఖపై నమ్మకం కలుగుతుందన్నారు. 9 నెలల శిక్షణ కాలంలో 30 ఏళ్ల సర్వీసుకు సరిపడా నేర్చుకోవాలని చెప్పారు. శాంతి భద్రతలు సక్రమంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయులు స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, కలెక్టర్ పి.రాజాబాబు, ఎస్పీ హర్షవర్థన్ రాజు, పీటీసీ ప్రిన్సిపాల్ జీఆర్ రాధిక, విజయవాడ డీసీపీ కేజీవీ సరిత తదితరులు పాల్గొన్నారు.
గిద్దలూరు రూరల్: గ్యాస్ సిలిండర్ లీకై హోటల్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటన పట్టణంలోని జయరాం లాడ్జి సమీపంలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళితే..హోటల్ యజమాని వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ లీకై మంటలు వ్యాపించాయి. దీంతో హోటల్‌లోని వారంతా భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించలేదు.
న్యాయ సమస్యలు పరిష్కరించి కానిస్టేబుల్ ఉద్యోగాలు


