ప్రశ్నించే గొంతులపై ఉక్కుపాదం
ఒంగోలు సబర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగం కల్పించిన హక్కులను నిర్వీర్యం చేస్తూ రాజ్యాంగ స్వతంత్ర సంస్థలను తమ జేబు సంస్థలుగా మార్చుకుంటున్నాయని ఓపీడీఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ రాంకుమార్ ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యహక్కుల పరిరక్షణ సంస్థ జిల్లా కమిటీ సమావేశం సోమవారం ఒంగోలులోని ఏఐబీఎస్పీ కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి ఓపీడీఆర్ జిల్లా అధ్యక్షుడు గాలి సంగీతరావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన రాంకుమార్ మాట్లాడుతూ దేశంలోని సంపదలను తమ అనుకూల కార్పొరేట్ శక్తులకు అప్పనంగా కట్టబెడుతున్నారని, ప్రశ్నిస్తున్న గొంతులపై ఉక్కుపాదం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌ఐఆర్ పేరుతో ఓటుహక్కులను కాల రాస్తున్నారని, స్వతంత్ర సంస్థగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘాన్ని తమ జేబు సంస్థగా మార్చుకున్నారని దుయ్యబట్టారు. వందేమాతరాన్ని ఒక సమస్యగా సృష్టిస్తూ ప్రజలను గందరగోళపరుస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని భూములను కార్పొరేట్ శక్తులకు తమ అనుకూల పెత్తందారులకు, పీపీపీ విధానాల పేరుతో ప్రభుత్వ ఆస్తులను కట్టబెడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును అమ్మేసేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. మెడికల్ కళాశాలను ప్రభుత్వమే నిర్వహించాలని, అప్పుడే ప్రజలందరికీ వైద్యం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. గిరిజనులపై ఉక్కుపాదం మోపుతూ ఖనిజ సంపదలను కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పే ప్రయత్నాలు విరమించుకోవాలని సూచించారు. బూటకపు ఎన్‌కౌంటర్లు ఆపాలని, శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు చావలి సుధాకర్‌రావు, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ పి.పేరయ్య, ఐఎల్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సుందరం, ఓపీడీఆర్ జిల్లా కమిటీ సభ్యులు న్యాయవాది పరిటాల వెంకటేశ్వర్లు, శిరీష, భీమవరపు సుబ్బారావు, షేక్ మొహమ్మద్ బాష, పి.నరేంద్ర, ఎం సుబ్బారావు, టి.వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
ప్రమాదంలో భారత రాజ్యాంగం
మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ మానుకోవాలి
ఓపీడీఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ రామ్‌కుమార్ ధ్వజం


